తన అనుకున్న వాళ్ళే జగన్మోహన్ రెడ్డికి షాకిచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్టీయార్ హెల్త్ యూనివర్సిటినీ ప్రభుత్వం డాక్టర్ వైస్సార్ హెల్త్ యూనివర్సిటీగా పేరు మార్చేసింది. శాసనసభ, శాసనమండలిలో బలమున్న కారణంగా చట్టసభల్లో తీర్మానాలు చాలా సులభంగా ఆమోదం పొందాయి. అయితే విషయం ఏమిటంటే జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తనకు సన్నిహితులైన వాళ్ళు బహిరంగంగానే తప్పుపట్టారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతు అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రాజీనామాచేశారు. ఒకవైపు జగనే తన హీరో అంటునే మరోవైపు ఎన్టీయార్ పేరును యూనివర్సిటీకి తీసేయటం తప్పన్నారు. అలాగే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేయటం తప్పన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని వంశీ ట్విట్టర్లో జగన్ కు సూచించారు.
టీడీపీ తరపున గెలిచిన వంశీ వివిధ కారణాల వల్ల చంద్రబాబునాయుడుకు దూరమైపోయి జగన్ కు దగ్గరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వంశీ గన్నవరంలో వైసీపీ తరపునే పోటీచేస్తారనే ప్రచారం ఉంది. అలాంటి వంశీ కూడా జగన్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరుమార్చటాన్ని ఎన్టీయార్ అభిమానులు ఎవరూ జీర్ణించుకోలేరనే చెప్పాలి. ఎప్పటినుండో ఉన్న పేరును హఠాత్తుగా తీసేయటం తప్పే. అంతగా కావాలంటే కొత్తగా ఏదైనా సంస్ధ లేదా వ్యవస్ధను ఏర్పాటుచేసుకుని దానికి వైఎస్సార్ పేరు పెడితే ఎవరూ కాదనేదిలేదు.
చంద్రబాబుకన్నా తనకే ఎన్టీయార్ అంటే ఎక్కువ గౌరవమని ఒకవైపు చెబుతునే మరోవైపు ఎన్టీయార్ పేరు తీసేయటం ఏమీ బావోలేదు. పేరు మార్చటానికి జగన్ కారణాన్ని వినిపించారు కానీ అంతగా అతకలేదు. ఏదేమైనా కొత్తగా జగన్ రేపిన వివాదం ఇప్పట్లో సద్దుమణుగుతుందని అనుకోవటంలేదు. అనవసరంగా లేని వివాదాన్ని జగన్ కెలుక్కున్నట్లయ్యింది. ప్రభుత్వ నిర్ణయంపై ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.