వచ్చే ఎన్నికల్లో వైసీపీ కీలకంగా భావిస్తున్న ప్రాంతం ఉత్తరాంధ్ర. ముఖ్యంగా సీఎం జగన్ ఈ ప్రాంతం పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. విశాఖను రాజధాని చేస్తామని, శ్రీకాకుళంలో సమస్యలు పరిష్కరి స్తామని, విజయనగరంలో కొఠియా గ్రామాలను ఏపీలో కలుపుకొంటామని.. ఆయన తరచుగా చెబుతున్నా రు. ఇవన్నీ దశాబ్దాలుగా ఉన్న సమస్యలే. అయితే.. ఇప్పుడు వాటిని పరిష్కరించి.. ఉత్తరాంధ్రలోక్లీన్ స్వీప్ చేయాలనేది జగన్ లక్ష్యంగా ఉంది.
అందుకే.. ఇతర ప్రాంతాలకంటే కూడా ఆయన ఉత్తరాంధ్రకే ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ముందుగానే ప్రకటించడం.. లేదా.. ఉన్నవారిని పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇవ్వడం వంటి కీలక నిర్ణయాలు కూడా తీసుకుంటున్నారు. అయితే.. ఈ ఉత్తరాంధ్రలో వైసీపీ నేతల మధ్య సమన్వయం లేకపోవడం.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాయకులు చేతులు చేతులు కలిపి ముందుకు సాగితేనే పార్టీ ముందుకు నడుస్తుంది.
కానీ, ఉత్తరాంధ్రలో మాత్రం వైసీపీ నాయకుల మధ్య ఎడ్డెం అంటే తెడ్డెం అనే విధంగా రాజకీయాలు ముందుకు సాగుతున్నాయి. ఇక, ఇప్పటికే ఉత్తరాంధ్ర ఇంచార్జ్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఈ పరిస్థితుల ను సర్దు బాటు చేయడంలోనూ.. మీడియాను మేనేజ్ చేయడంలోనూ విఫలమవుతున్నారని వైసీపీ అధిష్టానం భావిస్తోంది. విజయసాయిరెడ్డిని తప్పించి మరీ వైవీకి అప్పగించినా. ఉత్తరాంధ్రలో పరిస్థితులు ఏమాత్రం సర్దుమణగలేదు. పైగా నేరుగా సీఎం వద్దే పంచాయతీలు జరుగుతున్నాయి.
ఇటీవల విశాఖకు వచ్చిన సీఎంకు విమానాశ్రయంలోనే రెండు వ్యతిరేక వర్గాలు పోటాపోటీగా స్వాగతాలు పలికాయి. దీనిని సీఎం జగన్ సీరియస్ గా తీసుకున్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయాలని లేదా? అని ఆయన ప్రశ్నించారు. అంటే.. నేతల మధ్య సమన్వయం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఈ నేపథ్యం లో వచ్చే ఎన్నికల నాటికి వైవీని తప్పించే అవకాశం ఉందని అంటున్నారు వైసీపీ నాయకులు. ఇదిలావుంటే.. వైవీ సుబ్బారెడ్డి మాత్రం తన సీటు, తన వారి కోసమే పనిచేస్తున్నారని.. తమ సమస్యలు వినిపించుకోవడంలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.