హెచ్-1 బీ వీసా. అగ్రరాజ్యం అమెరికాలో ఉద్యోగం చేయాలని అనుకునేవారికి ఇది ఒక పెద్ద కల. ముందు దీనిని సంపాయిస్తే.. తప్ప అగ్రరాజ్యంలో ఆశల సౌధంలోకి అడుగు పెట్టే అవకాశం లేదు. ఇప్పుడు ఆ కల నెరవేర్చుకునే అవకాశం వచ్చింది. వచ్చే మార్చి 6వ తేదీ నుంచి అమెరికా వీసా హెచ్-1బీ వీసాలకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. దీంతో భారత దేశం నుంచి అమెరికాకు వెళ్లాలని అనుకునే ఉద్యోగులు ఎగిరి గంతేశారు. కానీ, ఈ ఉత్సాహం.. ఈ ఆనందం.. మరుసటి రోజే నీరుగారి పోయాయి. దీనికి కారణం.. హెచ్-1బీ వీసాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ సహా దరఖాస్తుల ఫీజులను అమెరికా..అందనంతగా పెంచేయడమే.
గతానికి ఇప్పటికి 100 శాతానికి పైగా ఫీజులు పెంచేశారు. దీంతో ఇప్పుడు హెచ్-1బీ వీసాలు కోరుకునే మధ్య తరగతి ఆశావ హులు అటు వెళ్లాలంటే అప్పులైనా చేయాలి. లేకుంటే ఆశలైనా వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అమెరికాలో నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. ముఖ్యంగా టెక్ కంపెనీలలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో ఆయా సంస్థలు భారత్, చైనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయి. దీంతో ఈ దేశాల నుంచే హెచ్-1బీ వీసాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. గత కొన్నాళ్లుగా ఈ వీసాలను జారీ చేయకపోవడం తెలిసిందే. ఎట్టకేలకు అనేక నిబంధనలతో తాజాగా హెచ్-1బీ వీసాలకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.
కానీ, తాజా ప్రక్రియనంతా కూడా అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం(యూఎస్సీఎస్) ఆన్లైన్ చేసేసింది. వీసా కోరుకునే అభ్యర్థులు తొలుత ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఒక ఫీజును నిర్ణయించారు. ఇది .. గతం కన్నా వంద రెట్లు ఎక్కువగా నిర్ణయించారు. ఇక, ఆ తర్వాత.. వీసా దరఖాస్తు పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. దీనికి కూడా అసాధారణంగా ఫీజులు పెంచేశారు. పైగా.. ఎవరు ఎన్ని దరఖాస్తులు పెట్టినప్పటికీ ఒకటే దరఖాస్తుగా పరిగణించనున్నారు. మొత్తంగా ఈ ధరల పెంపుదల ఇప్పుడు అభ్యర్థులను తొలి దశలోనే నిలువరించేసేట్టుగా ఉందని ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి.
ఇవీ.. ధరలు..
+ హెచ్-1బీ వీసా: దరఖాస్తు ధర 460 డాలర్ల నుంచి 780 డాలర్లకు పెరిగింది.(38 వేల నుంచి 64700 కు పెంచారు)
+ హెచ్-1బీ రిజిస్ట్రేషన్ రుసుము 10 డాలర్ల నుంచి 215 డాలర్లకు పెంచారు.(800 నుంచి 17,800లకు పెంచారు)
+ ఎల్-1 వీసా దరఖాస్తు రుసుము 460 డాలర్ల నుంచి 1,385 డాలర్లకు పెంచారు.(38 వేల నుంచి 1,15000)
+ ఈబీ-5 వీసాల అప్లికేషన్ ఫీజులను 3,675 డాలర్ల నుంచి ఏకంగా 11,160 డాలర్లకు పెంచారు.(3లక్షల 4 వేల నుంచి 9 లక్షలు)