అగ్రరాజ్యం అమెరికా వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ డేట్ కు సంబంధించి ఇప్పటివరకు ఉన్న విధానం కాకుండా కొత్త విధానం తెర మీదకు వచ్చింది. ఈ కొత్త నిబంధన కొత్త ఏడాది నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం నాన్ ఇమిగ్రెంట్ వీసా ఇంటర్వ్యూ అపాయింట్ మెంట్ తేదీని ఖరారు చేసుకున్న తర్వాత మూడుసార్లు తేదీలు లేదంటే ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రాంతాల్నిమార్చుకునే వెసులుబాటు ఉంది.
ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్.. చెన్నై.. ముంబయి.. కోల్ కతా నగరాల్లోని కాన్సులేట్ కార్యాలయాల్లో ఎక్కడైనా వీసా ఇంటర్వ్యూ ప్రాంతాన్నిఎంపిక చేసుకొని హాజరుకావొచ్చు. కొత్త సంవత్సరంలో అమల్లోకి వచ్చే నూతన నిబంధన ప్రకారం మాత్రం ఇప్పటి మాదిరి మూడుసార్లు మార్చుకునే వీల్లేదు. ఒక్కసారి మాత్రమే ఇంటర్వ్యూ తేదీని.. హాజరయ్యే ప్రాంతాన్ని మార్చుకోవాలి.
ఒకవేళ.. ఒకసారికి మించి మార్పులు చేసుకోవాలంటే మరో దఫా ఫీజు చెల్లించాలి. సాధారణంగా నాన్ ఇమిగ్రెంట్ వీసా అప్లికేషన్ ఫీజు 185 అమెరికన్ డాలర్లు చెల్లించాలి. కొత్త ఏడాది జనవరి 1, 2025 నుంచి ఈ కొత్త నిబంధనను అమల్లోకి తెస్తున్నారు. ఈ రూల్ మార్పునకు కారణం ఏమిటన్న విషయానికి వస్తే..
అప్లికెంట్లకు సమాన అవకాశాలు కల్పించటమేనని చెబుతున్నారు. ఇక.. బెంగళూరులో ఏర్పాటు చేయనున్న యూఎస్ కాన్సులేట్ కొత్త సంవత్సరం జనవరి నుంచి అందుబాటులోకి వచ్చే వీలుందని చెబుతున్నారు. దీంతో మిగిలిన కాన్సులేట్ల మీద వీసా అప్లికెంట్ల భారం తగ్గనుందని చెప్పక తప్పదు.