అమెరికాలో తెలుగు సంతతి మహిళ ‘జయ బాడిగ’ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో కౌంటీ సుపీరియర్ జడ్జిగా నియమితురాలైన సంగతి తెలిసిందే. కాలిఫోర్నియా జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తొలి తెలుగు సంతతి మహిళగా ‘జయ బాడిగ’ నిలవడంతో తెలుగువారంతా గర్వపడుతున్నారు. ఈ క్రమంలోనే నేడు ఆమె పదవీ ప్రమాణం చేశారు.
ఈ సందర్భంగా తన ప్రమాణ స్వీకారాన్ని మాతృభాష ‘తెలుగు’లో చేసిన ‘జయ బాడిగ’పై ప్రశంసలు కురుస్తున్నారు. మీ అందరికీ ‘నా హృదయపూర్వక స్వాగతం’ అంటూ తెలుగులో పదవీ ప్రమాణం ప్రారంభించిన ‘జయ బాడిగ’..దానిని ఇంగ్లీషులోకి కూడా అనువదించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఆ వీడియోను టాలీవుడ్ మెగాస్టార్, పద్మ విభూషణ్ ‘చిరంజీవి’ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసి హర్షం వ్యక్తం చేశారు.
కాలిఫోర్నియాలో తొలి తెలుగు మహిళా న్యాయమూర్తిగా నియమితురాలైన ‘జయ బాడిగ’ గారికి హృదయపూర్వక అభినందనలు. ఆమె తన మూలాలను మర్చిపోకుండా, తెలుగు సంస్కృతిని, ఉపనిషత్తులను ప్రస్తావిస్తూ ఎంత ఆనందాన్ని పొందిందో చూసి థ్రిల్లయ్యాను. ఆమె నిజంగానే తెలుగు వారందరూ ఎంతో గర్వపడేలా చేసింది. భవిష్యత్తులో ఆమె మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మరెందరో తన బాటలో నడిచేలా స్ఫూర్తినిస్తారని ఆకాంక్షిస్తున్నాను. ఆమె మా కుటుంబ మిత్రుడు ‘బాడిగ రామకృష్ణ’ గారి కుమార్తె కావడం వ్యక్తిగతంగానూ ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది అని చిరంజీవి ట్వీట్ చేశారు.
Hearty congratulations to Jaya Badiga Garu on becoming the first female Judge in California – USA. I am thrilled at how she has derived great pleasure in acknowledging her roots, Telugu culture and invoked our Upanishads. She has truly made all Telugus proud with her… pic.twitter.com/fnmBwIB58A
— Chiranjeevi Konidela (@KChiruTweets) May 26, 2024