ఏపీ సీఎం జగన్ పై ఇప్పటికే చాలా కేసులున్న సంగతి తెలిసిందే. ఆదాయానికి మించిన ఆస్తులు, అక్రమాస్తులు, క్విడ్ ప్రోకో వంటి పలు కేసులలో జగన్ విచారణను ఎదుర్కొంటున్నారు. ఈడీ, సీబీఐలు జగన్ పై ఉన్న కేసులను విచారణ జరుపుతున్నాయి. గతంలో ఆ కేసుల నేపథ్యంలో జగన్ జైలుకు కూడా వెళ్లారు. ఈ క్రమంలోనే తాజాగా జగన్ కు మరో కోర్టు సమన్లు పంపడం సంచలనం రేపుతోంది.
జగన్ పై ఇప్పటివరకు స్టేట్, నేషనల్ రేంజ్ లో కేసులున్నాయి. కానీ, తాజాగా ఈసారి జగన్ కు అంతర్జాతీయ స్థాయి కోర్టు నుంచి సమన్లు అందడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఓ కొత్త కేసుకు సంబంధించి అగ్రరాజ్యం అమెరికా కోర్టు జగన్ కు సమన్లు పంపించింది. జగన్ తో పాటు భారత ప్రధాని నరేంద్ర మోడీ, తాజాగా ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానంలో కొనసాగుతోన్న వ్యాపార వేత్త గౌతమ్ అదానీకి కూడా యూఎస్ కోర్టు సమన్లు జారీ చేసింది.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఉయ్యూరు లోకేశ్ దాఖలు చేసిన ఓ పిటిషన్ నేపథ్యంలో వారికి ఈ సమన్లు అందాయి. అమెరికాలోని కొలంబియాలో ఉంటున్న లోకేశ్ రిచ్ మండ్ లో గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టుగా పని చేస్తున్నారు. అవినీతి, పెగాసస్ స్పైవేర్ తో పాటు అమెరికాకు అక్రమంగా నగదు తరలింపు చేశారంటూ మే 24న అమెరికా స్థానిక కోర్టులో లోకేశ్ 53 పేజీల పిటిషన్ దాఖలు చేశారు.
జగన్, మోడీ, అదానీ తదితరులు భారీగా అవినీతికి పాల్పడ్డారని, భారీ మొత్తంలో డబ్బును అమెరికాకు తరలించారని లోకేశ్ ఆ పిటిషన్ లో ఆరోపించారు. తమ రాజకీయ ప్రత్యర్థులపై పెగాసన్ స్పైవేర్ ను ఉపయోగించారని పిటిషన్ లో చెప్పారు. దీంతో, ఆ పిటిషన్ పై విచారణ జరిపిన అమెరికా స్థానిక కోర్టు.. జగన్, గౌతమ్ అదానీలకు ఆగస్టు 4న నోటీసులు జారీ చేసింది.
అయితే, పబ్లిసిటీ కోసమే లోకేశ్ అనవసరమైన పిటిషన్లు దాఖలు చేస్తుంటారని న్యూయార్క్ లో నివాసముంటున్న ఎన్నారై రవి బాత్రా చెప్పారు. గతంలో కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీపై కూడా కేసులు వేశారని, వాటిని కోర్టు కొట్టివేసిందని తెలిపారు.