మళ్లీ వార్తల్లోకి వచ్చారు ఊర్వశీ రౌతేలా. అర్థం లేని ఒక ఊహాగానాన్ని ట్వీట్ రూపంలో పెట్టేసి.. సంచలనంగా మారిన ఒక వ్యక్తిపై సీరియస్ అయ్యారు బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా. మిగిలిన సందర్భాల్లో ఎలా ఉన్నా.. తాజా ఎపిసోడ్ లో మాత్రం ఆమె చొరవను పలువురు అభినందిస్తున్నారు. అర్థం లేని ఆరోపణను ట్వీట్ రూపంలో చేసిన వ్యక్తిపై ఘాటు వార్నింగ్ ఇవ్వటమే కాదు.. కేసు పెట్టేందుకు తన టీం ప్రయత్నిస్తున్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేశారు. ఇంతకూ అసలేం జరిగిందంటే..
అఖిల్ హీరోగా నటించిన ఏజెంట్ మూవీ మీద బోలెడన్ని అంచనాలు ఉన్నాయి. ఇప్పటివరకు ఉన్న చాక్లెట్ బాయ్ ఇమేజ్ ను పూర్తిగా పొగొట్టేసేలా.. తన లుక్స్ ను మార్చేసిన అఖిల్ ఈ మూవీ మీద చాలానే ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో అఖిల్ తో ఆడిపాడారు. ఇదిలా ఉంటే.. సోషల్ మీడియాలో స్వయం ప్రకటిన అంతర్జాతీయ సెన్సార్ బోర్డు సభ్యుడినని చెప్పుకుంటూ వివాదాస్పద ట్వీట్లు చేసే ఉమైర్ సంధు.. తాజాగా ఒక షాకింగ్ ట్వీట్ చేశారు.
కొత్త సినిమా రివ్యూలతో పాటు.. సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ మీద అతగాడు ట్వీట్లు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో ఊర్వశిపై ఒక ట్వీట్ చేశారు. ఏజెంట్ మూవీ షూట్ లో ఊర్వశిని అఖిల్ వేధింపులకు గురి చేశాడని.. ఆమె ఉద్దేశం ప్రకారం అతడితో పని చేయటం చాలా కష్టమన్నది ట్వీట్ సారాంశం. ఈ పోస్టు వైరల్ గా మారింది. ఈ నేపథ్యంలో రియాక్టు అయిన ఊర్వశి రౌతేలా సీరియస్ అయ్యారు.
ఇలాంటి పనికిమాలిన ట్వీట్స్ చేస్తున్న ఈ వ్యక్తి మీద తన టీం ఇప్పటికే పరువునష్టం దావా వేసిందని.. ఇలాంటి వారి వల్ల తాను.. తన కుటుంబం ఇబ్బంది పడాల్సి వస్తోందని పేర్కొన్నారు. ఉమైర్ పెట్టిన ట్వీట్ లోనిజం లేదని తేల్చేసిన ఆమె.. అఖిల్ కు క్లీన్ చిట్ ఇచ్చేశారు. ‘ఈ వ్యక్తి పెడుతున్న పోస్టులను నమ్మొద్దు’ అంటూ స్పష్టం చేశారు. మరి.. ఇప్పుడీ అతిగాడి మీద అక్కినేని ఫ్యాన్స్ ఏ రీతిలో రియాక్టు అవుతారో చూడాలి.