ఆన్ లైన్లో, ఆఫ్ లైన్లో మెగా, నందమూరి అభిమానులు ఎలా గొడవలు పడుతుంటారో తెలిసిందే. అవతలి హీరోను డీగ్రేడ్ చేయడమే పనిగా ఈ ఫ్యాన్ వార్స్ నడుస్తుంటాయి. నిన్న ‘వార్-2’ టీజర్ రిలీజైన సందర్భంగానూ అవతలి వర్గం జూనియర్ ఎన్టీఆర్‌ను విపరీతంగా ట్రోల్ చేసింది. అలా అని తారక్ ఫ్యాన్స్ కూడా తక్కువేమీ కాదు. ‘గేమ్ చేంజర్’ రిలీజ్ టైంలో బాగానే డ్యూటీ చేశారు. ఐతే ఈ ఫ్యాన్స్ ఇలా విసుగూ, విరామం లేకుండా కొట్టేసుకుంటూ ఉంటారు కానీ.. అక్కడ ఇద్దరు హీరోలు మాత్రం చాలా స్నేహంగా ఉంటారు.
తమ ఇద్దరి మధ్య ఎంత సాన్నిహిత్యం ఉందో ఇటు తారక్, అటు చరణ్ ఇద్దరూ కూడా పలు సందర్భాల్లో చెబుతూనే వస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ టైంలో, ఆ తర్వాత ఇద్దరూ ఎంతో క్లోజ్‌గా కనిపించారు. తమ ఇద్దరి కుటుంబాల మధ్య ఉన్న బంధం గురించి కూడా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అయినా ఫ్యాన్స్‌లో ఏ మార్పూ లేదు. తాజాగా చరణ్ భార్య ఉపాసన.. ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీ ప్రణతి గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నాయి.
లక్ష్మీ ప్రణతి ఎంతో తెలివైన అమ్మాయి అని.. అలాంటి అమ్మాయి దొరకడం తారక్ అదృష్టమని ఉపాసన వ్యాఖ్యానించింది. ప్రణతి ఇంటిని భలే మెయింటైన్ చేస్తుందని.. తాను లేని సమయాల్లో కూడా ఇంటికి వచ్చి దాన్ని భలేగా మేనేజ్ చేస్తుందని ఉపాసన వ్యాఖ్యానించడం విశేషం. ప్రణతి స్వీటెస్ట్ గర్ల్, స్ట్రాంగెస్ట్ ఉమన్ అంటూ ఆమె మీద ఉపాసన ప్రశంసలు కురిపించింది. తన చుట్టూ ఉన్న వాళ్లందరినీ ప్రణతి చాలా బాగా చూసుకుంటుందని.. తనకంటే చాలా చిన్నదైనప్పటికీ.. చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుందని.. ఆమెను చూడగానే ఒక ప్రశాంతత వస్తుందని ఉపాసన చెప్పడం విశేషం.