జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఊహించని ఆహ్వానం అందింది. ఐక్యరాజ్యసమితిలో పొలిటికల్ వింగ్ ఆయనను ప్రత్యేక సభకు ఆహ్వానించింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్య దేశాల్లో నిస్వార్థంగా రాజకీయాలు చేసే వారిని ఆహ్వానిస్తున్నట్టు ఈ వింగ్ పేర్కొంది. ఈ నెల 22న అమెరికాలోని న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ప్రపంచ స్థాయి రాజకీయాలపై పెద్ద సదస్సును ఏర్పాటు చేశారు. దీనిలో ప్రసంగించేందుకు నలుగురు నిస్వార్థ నాయకులను భారత్ నుంచి ఎంపిక చేశారు. వీరిలో పవన్ కల్యాణ్ ఒకరు.
మిగిలిన వారిలో బెంగాల్, ఒడిశా, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్టు సమాచారం. ఇక, ప్రపంచ దేశాల్లోని ప్రజాస్వామ్య యుత దేశాల నుంచి మొత్తం 120 మంది ప్రతినిధులను ఆహ్వానించారు. ఈ సదస్సు మే 22న జరగనుంది. భారత్లో ప్రజాస్వామ్య విలువల పరిరక్షణ, ప్రశ్నించే తత్వం, ప్రజలకు చేరువగా ఉండడం, ప్రజాస్వామ్య పరిరక్షణ వంటి విషయంలో కృషి చేస్తున్నవారిని ఎంపిక చేసినట్టు ఐక్యరాజ్యసమితిలోని పొలిటికల్ వింగ్ వివరించింది. దీనిలో పవన్ పేరు ఉండడంతో జనసేన కార్యకర్తలు నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు.
2014 ఎన్నికల సమయంలో పార్టీ పెట్టిన పవన్.. అప్పటి నుంచి ప్రజాసమస్యలపై పోరాడుతున్నారని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల ఓడిపోయినా.. ప్రజల విషయంలో వెన్ను చూపలేదని తెలిపింది. ప్రజా స్వామ్యంలో ఎన్నికలే పరమావధి కాకుండా పనిచేస్తున్నవారిలో పవన్ కూడా ఒకరని తెలిపింది. సమస్యలను పరిశీలించడం.. ప్రశ్నించడం.. పరిష్కారం చూపడం అనే మూడు కీలక విషయాలనుపవన్ విషయంలో ప్రస్తావించడం విశేషం.
అదేవిధంగా కౌలు రైతుల విషయంలో పవన్ చేసిన సేవను అసమానమని కొనియాడింది. ఇక, ఈ ఆహ్వానంపై పవన్ స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన దీనిపై ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. అయితే.. మే 13తో ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసిపోతున్న నేపథ్యంలో పవన్ వెళ్లేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.