- సమస్యలు గాలికొదిలేసి
- రాజకీయ కార్యకలాపాలు
- వేతన సవరణకు డిమాండ్ చేయరు
- రావలసిన ఆరు డీఏల ఊసెత్తరు
- ప్రభుత్వ పెద్దల అడుగులకు మడుగులు
- ఎన్నికల విధులకు కరోనా సాకు
- పాల్గొనబోమని సంఘాల నేతల హుంకరింపు
- కమిషనర్‌నే చంపుతామని బెదిరింపు
- చాచికొట్టిన సుప్రీంకోర్టు
- పరువుపోయిందని ఉద్యోగుల ఆవేదన
- నాయకుల తీరుపై ఆగ్రహం
అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు వారికి కరోనా గుర్తురాలేదు.. తమ పిల్లల పెళ్లిళ్లకు వేల మందిని ఆహ్వానించి అట్టహాసం చేసినప్పుడు ప్రాణభయం లేదు. వైరస్ ఉధృతి సమయంలో కనీసం ఇంటి నుంచి పనిచేయడానికి కూడా ప్రభుత్వం అంగీకరించనప్పుడు నోరు పెగల్లేదు. వేతన సవరణ పట్టదు. ఆరు డీఏలు పెండింగ్‌లో ఉన్నా.. అడగరు. తమను నమ్మి ఎన్నుకున్న ప్రభుత్వ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత పెద్దలకు తాకట్టుపెట్టి.. అధికార పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగ సంఘాల నేతలు పనిచేస్తున్నారు.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకాన్ని (సీపీఎస్) రద్దుచేసి.. పాత విధానం పునరుద్ధరిస్తానని ఎన్నికల ముందు జగన్ హామీ ఇచ్చార. ఇంతవరకు దానికి అతీగతీ లేదు. ప్రభుత్వం ఆరు డీఏలో ఇవ్వాల్సి ఉండగా.. ఒక్కటి కూడా ఇప్పించుకోలేని పరిస్థితి. సీఎంను కలిశాం.. రెండు డీఏలు చెల్లిస్తామని హామీ ఇచ్చారని కొందరు నాయకులు డ్రామాలు ఆడుతున్నారు.
అసలు వారికి ఆయన దర్శనమే ఇవ్వరు. సచివాలయానికి రారు. అస్తమానం తాడేపల్లి క్యాంపు కార్యాలయంలోనే ఉంటారు. ఉద్యోగ నేతలు మహా అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని మాత్రమే కలవగలరు. అక్కడ ఆయన వారికి హితోపదేశం చేస్తారు. వేతనాల పెంపు అడగొద్దు.. డీఏల ఊసెత్తవద్దు.. సీపీఎస్ గురించి మరచిపోవాలని చెబుతారు. కాదంటే ఏసీబీ దాడులు చేస్తుందని బెదిరిస్తారు. ఆ భయంతో ఉద్యోగ సంఘాల నేతలు ఆ ప్రస్తావనే తేవడం లేదు. చివరకు వారు వైసీపీ ప్రభుత్వ ప్రతినిధులుగా మారిపోయి వల్లమాలిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు.
దేశమంతటా స్థానిక ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే.. ఇక్కడ కరోనా ఉంది జరపడానికి వీల్లేదన్నారు. ఎన్నికలకు, రాష్ట్ర సచివాలయానికి సంబంధమే లేదు. కానీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మాత్రం వాతలు పెట్టుకుని కుప్పిగంతులు వేశారు.
ఊరూపేరు లేని కొన్ని సంఘాలకు తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకుని.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై రాజకీయ విమర్శలకు దిగారు. వీధి రౌడీలా మాట్లాడారు. చివరకు ఆత్మరక్షణ కోసం కమిషనర్‌ను చంపే అధికారం రాజ్యాంగం తమకు కల్పించిందనే స్థాయికి వెళ్లారు. వైసీపీ నేతలు, మంత్రులు నిమ్మగడ్డను వ్యక్తిగతంగా దుర్భాషలాడుతుంటే.. రాజ్యాంగం, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు ఈ రీతిగా బరితెగించి బహిరంగంగా జగన్‌కు మద్దతుగా నిలవడం చివరకు సుప్రీంకోర్టును కూడా విస్మయానికి గురిచేసింది.
పంచాయతీ ఎన్నికలు జరపాల్సిందేనని హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును జగన్ సర్కారు సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. దానితో పాటు ప్రభుత్వ ఉద్యోగుల సంఘం, ప్రభుత్వ వైద్యుల సంఘం కూడా పిటిషన్లు వేశాయి. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముగిసేదాకా ఎన్నికలు వాయుదా వేయాలని కోరాయి. కమిషనర్ పట్ల పిటిషన్లో ప్రభుత్వంతోపాటు ఈ సంఘాలు కూడా అనుచిత పదజాలం ప్రయోగించడంపై సుప్రీంకోర్టు మండిపడింది. విధులు నిర్వర్తించకుండా ఇలాంటి రాజకీయ పిటిషన్లు ఎలా వేస్తారని ఆక్షేపించింది.
రాష్ట్ర ఉద్యోగులకు మంచిపేరు..
సర్వకాల.. సర్వావస్థల్లో బాగా కష్టపడి పనిచేస్తారని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు జాతీయ స్థాయిలో మంచిపేరు ఉంది. వరదలు, విపత్తులు, కరోనా విలయం..ఏదైనా ప్రాణాలకు తెగించి ముందువరసలో ఉండి ప్రజలకోసం పనిచేసిన అనుభవం వారిది. అందుకు ఏపీ ఉద్యోగులంటే అంద రికీ గౌరవం. ఈ గౌరవాన్ని, ఉన్నతిని తమ నేతలే గంగపాలు చేశారని, ఢిల్లీ స్థాయిలో మంటగలిపారని ఉద్యోగులు ఆక్రోశిస్తున్నారు.
చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కోర్టులతో చివాట్లు తింటూ మా నేతలు ఎవరికోసం పనిచేస్తున్నారంటూ వారు మండిపడుతున్నారు. వేనోళ్లుపొగిడిన చోట మాటపడే పరిస్థితి తీసుకొచ్చారని, ఇదంతా ఎవ రికోసమంటూ నేతలను నిలదీస్తున్నారు. ఈ మొత్తం ఏపిసోడ్‌లో ఉద్యోగుల మేలుకోసం నేతలు సాధించేదిమిటని వారు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ ఇచ్చిన షెడ్యూల్‌ను ప్రభుత్వంతోపాటు వారెందుకు సవాల్ చేశారని నిలదీస్తున్నారు.
ప్రభుత్వానికి, ఎస్ఈసీకి నడుమ జరిగే పోరులో ఉద్యోగ సంఘాల నేతలు జోక్యం చేసుకోవద్దంటూ ప్రజాస్వామిక వాదులు, మేధావులు, నిపుణులు సూచించా సదరు నేతలు లెక్కచేయలేదు. ‘ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్దంగా వ్యవహరిస్తున్నాయి. రాజ్యాంగబవ్శ వ్యవహారాల్లో వాటి జోక్యం మంచిదికాదు. రెండు వ్యవస్థల మధ్య ఉన్న వ్యవహారంతో మీకేం సంబంధం. ఎస్ఈసీ సమావేశం నిర్వహించి పిలిస్తే ఉద్యోగ సంఘాలు ఎందుకు వెళ్లలేదు’ అంటూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్రవ్యాఖ్యలు చేసింది.
రాజ్యాంగబద్ధ సంస్థ ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయంలో కోర్టు జోక్యం చేసుకోదని చెబుతూనే ఆ నిర్ణయాన్ని పాటించాలంటూ సర్కారును ఆదేశించింది. ఈ నేపఽథ్యంలో కోర్టే జోక్యం చేసుకోలేకపోయిన ఈ అంశంలో ఉద్యోగ సంఘాలు ఎంతగా భాగస్వామ్యం అయ్యాయో, అది ఎంత చట్టవ్యతిరేకంగా ఉందో ధర్మాసనం వ్యాఖ్యలను బట్టి అర్ధమవుతోందని పలువురు ప్రభుత్వ ఉద్యోగులు చెబుతున్నారు. ఉద్యోగ ధర్మం మరచి ప్రభుత్వంతో అంటకాగడం వల్లే సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టిందని అంటున్నారు.
కరోనా విపత్తు సమయంలో ఫ్రంట్ వారియర్స్‌గా వైద్య, ఆరోగ్య, పురపాలక, రెవెన్యూ, పోలీసు, ఆర్టీసీ, ఇతర శాఖల సిబ్బంది క్షేత్రస్థాయిలో పనిచేశారు. అనేక మంది కరోనా బారినపడి చనిపోయారు. వేలాది మంది కరోనా చికిత్సల పేరిట లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టుకున్నారు. కొందరయితే సొంత ఆస్తులు అమ్ముకొని వైద్యం చేయించుకున్నారు.
‘కరోనా ప్రభావం తీవ్రంగా ఉన్న విధిగా ఆఫీసులకు హాజరుకావాలంటూ హెచ్వోడీలు సర్క్యులర్లు జారీ చేశారు. ఈ విషయంలో మాకు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలని కోరినా ప్రభుత్వం స్పందించలేదు. మా నేతలు ఈ అంశాలపై సర్కారును కలిసి మౌలిక సదుపాయాలను సాధించే ప్రయత్నం చేయలేదు. వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తామని మేం పదేపదే కోరినా ప్రభుత్వం అంగీకరించలేదు. ఇదే విషయంపై సీఎంవో అధికారులతో మాట్లాడేందుకు మా నేతలు సాహసించక ఎక్కడో ఉండిపోయారు.
ఆఫీసుల్లో శానిటేషన్, క్లీనింగ్ వంటివీ జరగడం లేదు.. మాకు ఇబ్బందికరంగా ఉందని ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు’ అని ఓ రెవెన్యూ ఉద్యోగి వాపోయారు. ‘వర్క్ ఫ్రమ్ హోమ్ కుదరదు. ఉద్యోగులు విధిగా ఆఫీసులకు రావాలని ప్రభుత్వం ఆదేశాలు వచ్చింది. దీన్ని పాటించాల్సిందేనంటూ సీసీఎల్ఏ కార్యాలయం ఉత్తర్వులు ఇచ్చింది. ఇదే విషయాన్ని మేం మా నేతల దృష్టికి తీసుకెళ్లాం. ఏం ఉపయోగం లేదు. ఆఫీసుకు రాకపోతే పనులెలా సాగుతాయని మా నాయకుడొకరు మాతోనే అన్నారు.
ఇదే విషయం మీడియాలో వచ్చాకే ఆ ఉత్తర్వులపై ఉన్నతాధికారులు వెనక్కి తగ్గారు. ఇంతటి విపత్తుకాలంలో మా భద్రత, రక్షణ గురించి మాట్లాడని నేతలు.. ఇప్పుడు కరోనా ప్రభావం బాగా తగ్గి వాక్సినేషన్ దశకు వచ్చేసరికి మా ఉద్యోగుల ప్రాణాలకు భరోసా ఎవరు అంటూ మాట్లాడం విడ్డూరంగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు మా సేప్టీ, సెక్యూరిటీ గురించి అటు ఉన్నతాధికారులు, ఇటు ప్రభుత్వాన్ని కలిసి మాట్లాడలేకపోయిన వారు ఇప్పుడు స్థానిక ఎన్నికలను ప్రభుత్వం వ్యతిరేకించే సరికి మేం కూడా అదే బాటలో అంటూ ఎస్ఈసీపై పడిపోతున్నారు.
మమ్మల్ని అడిగే ఎన్నికల నిర్ణయాన్ని వ్యతిరేకించారా? సంఘం సర్వసభ్య సమావేశం నిర్వహించే ఈ నిర్ణయానికి వచ్చారా? మీరు ఎవరికోసం పనిచేస్తున్నారు? ఉద్యోగుల కోసమా? ప్రభుత్వం మెప్పుపొందేందుకు ఆరాటపడుతున్నారా’ అంటూ మరో రెవెన్యూ అధికారి ఫైర్ అయ్యారు.
జాబితాయే పంపలేదు..
కరోనా వ్యాక్సినేషన్‌కు పోలీసులు, వైద్య, పురపాలక, కార్మిక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలు తమ ఉద్యోగుల జాబితాలను పంపించాయి. వివిధ దశల్లో ఈ జాబితాల్లోని ఉద్యోగులకు వ్యాక్సిన్ ఇస్తారు. ఇప్పటికే వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇస్తున్నారు. అయితే ఇప్పటి వరకు రెవెన్యూశాఖ నుంచి ఉద్యోగుల జాబితా వైద్య, ఆరోగ్యశాఖకు వె ళ్లలేదని ఉద్యోగులే చెబుతున్నారు. ‘ఫ్రంట్ వారియర్స్‌కు కరోనా వ్యాక్సిన్ ఇచ్చి తీరాల్సిందే.
కరోనా బాధితుల్లో అత్యధికులు రెవెన్యూ సిబ్బంది, ఉద్యోగులే. ఎక్కువగా నష్టపోయింది మేమే. కానీ ఈ రోజు దాకా వాక్సినేషన్ కోసం రెవెన్యూ ఉద్యోగుల జాబితాను వైద్య, ఆరోగ్యశాఖకు పంపించలేదు. ఈ విషయం ఉద్యోగ సంఘ నేతలకు తెలుసా? వ్యాక్సినేషన్ దశలో మా ప్రాణాలను పణంగా పెడతారా అంటూ నేతలు ఎస్ఈసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదన సరైనదే. కానీ, వ్యాక్సినేషన్‌కు జాబితా ఇంతవరకు ఎందుకు పంపలేదు? మా నేతలు ఎవరి రక్షణ కోసం పనిచేస్తున్నారు’ అని రెవెన్యూ ఉద్యోగ సంఘానికి చెందిన ఓ నేత నిలదీశారు.
తాజా పరిణామాలపై సచివాలయ ఉద్యోగులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎన్టీఆర్ కాలంలో జరిగిన సమ్మె తర్వాత ఉద్యోగులు మరే సందర్భంలోనూ ధిక్కార స్వరం వినిపించలేదని, అనేక సమస్యలు ఎదుర్కొన్నా ఎప్పుడూ కోర్టులు, రాజ్యాంగ వ్యవస్థలతో మాటపడలేదని వారు చెబుతున్నారు. ’’ రాష్ట్ర విభజన సమయంలోనూ సమైక్యరాష్ట్రం కోసం మేం ఉద్యమించాం.
విభజన అనివార్యమయ్యాక మా హక్కుల కోసం ఉద్యమించాం. రాజకీయ నేతలు, పార్టీలకన్నా ఉద్యోగులు నిజాయితీగా, చిత్తశుద్ధితో రాష్ట్రం కోసం పనిచేశారని ప్రజలు గుర్తించారు. విభజన తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించారు. అనూహ్యంగా ఏపీ కోసం అమరావతిని రాజధానిగా ఎంపిక చేసి ఇక్కడకు రావాలనప్పుడు ఇబ్బందిపడ్డది మేమే. పిల్లల చదువు, ఇళ్లు, ఇతర మౌలిక వనరులను వదులుకుని ప్రభుత్వ కోరిక మేరకు ఉన్నపళంగా అమరావతికి తరలిరావడం అంటే చిన్న విషయం కాదు.
మేం ఎందుకు రావాలి? మేం రాలేమని చెప్పలేదు. ప్రభుత్వ ప్రాధాన్యాలను గౌరవించి సకల సదుపాయాలున్న ప్రాంతాన్ని వదులుకొని అమరావతికి వచ్చాం. మహిళా ఉద్యోగులు హాస్టళ్లలో వసతి తీసుకున్నారు. ఏ నాడు ఎవరితో మాటపడకుండా మా ధర్మాన్ని నిర్వహించాం. కానీ ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కు మాత్రమే పరిమితమైన ఎన్నికల విషయంలో మా సంఘ నేతలు జోక్యం చేసుకోవడం, ఈ వివాదాన్ని తారస్థాయికి తీసుకెళ్లడం తీవ్రమైన అంశం.
ఉద్యోగ సంఘాలు చట్టవిరుద్ధంగా వ్యవహరించాయని దేశసర్వోన్నత న్యాయస్థాఽనమే వ్యాఖ్యానించేలా నేతలు వ్యవహరించారని అర్థమవుతోంది. కరోనా సమయంలోనే రెండు సార్లు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. సచివాలయ ఉద్యోగులు అనేక మంది కరోనా బారినపడ్డారు. అప్పుడెప్పుడూ మా నేతలు నిరసన స్వరం వినిపించలేదు. ఉద్యోగుల హక్కులు, ప్రాణాల గురించి మాట్లాడలేదు. కరోనా సమయంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించలేదు.
ఇంటి స్థలాల పంపిణీ కోసం రెవెన్యూ, పంచాయతీరాజ్, సర్వే శాఖలు అహోరాత్రులు పనిచేశాయి. ఇటీవల పెద్ద ఎత్తున సభలు, సమావేశాలు నిర్వహించారు. వీటికి ఎక్కడా కరోనా అడ్డురాలేదు. కరోనా సమయంలో ఈ సభలెందుకని ఏ ఒక్క ఉద్యోగ సంఘం నేత మాట్లాడలేదు. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులు నడుపుతున్నారు. సిబ్బంది ప్రాణాలకు తెగించి విధులు నిర్వహిస్తున్నారు.
కరోనా సమయంలో ఎంతో మంది ఆర్టీసీ ఉద్యోగులు ఫ్రంట్ వారియర్స్‌గా డ్యూటీలు చేశారు. వారి హక్కుల గురించి ప్రశ్నించిన వారేరి? ఇవన్నీ చూస్తుంటే నేతల తీరు ఉద్యోగుల సంక్షేమం కన్నా సర్కారుతో అంటకాగడమే ఎక్కువగా ఉందన్నట్లుగా ఉంది. ఇది పరాకాష్టకు వెళ్లడంతో సుప్రీం తీవ్రవ్యాఖ్యలు చేసే పరిస్థితి వచ్చింది.’ అని సచివాలయ ఉద్యోగి ఒకరు విశ్లేషించారు.
ఆ చొరవ ఉద్యోగుల సమస్యలపై ఏదీ?
ఉద్యోగ సంఘాల నేతల అత్యుత్సాహంపై పలువురు ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిపోయి ఉద్యోగులు ఎప్పటి లాగా విధులు నిర్వర్తిస్తున్న విషయం అందరికీ తెలిసిందేనని… అయితే ఆ విషయాన్ని విస్మరించి ఎన్నికలకు మాత్రమే కరోనా సాకు చెప్పడం సమంజసంగా ఉండదని హితవు పలుకుతున్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వ పెద్దలకు జవాబుదారీ కాదని, పన్నులు చెల్లించి మనకు జీతాలు ఇస్తున్న ప్రజలకే మనం బాధ్యులమన్న విషయం గుర్తెరగాలని పేర్కొంటున్నారు.
ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటనలతో ఇప్పటికే జనంలో చులకనయ్యామని చెబుతున్నారు. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రారంభించని విద్యాసంస్థలను కూడా జనవరి 18 నుంచి ప్రారంభించారు. గురువారం విజయవాడ బెంజ్ సర్కిల్లో ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఇంటింటికీ రేషన పంపిణీ కోసం వాహనాల ర్యాలీలను తీశారు. వేలాది మంది వైసీపీ కార్యకర్తలు బారులు తీరారు. అధికార యంత్రాంగం అన్నీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా రాని కరోనా ఒకే రోజు జరిగే ఎన్నికల పోలింగ్‌లోనే వస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు.
అప్పుడు సమర్థించారు..
రాష్ట్ర ఎన్నికల సంఘం నిరుడు మార్చిలో స్థానికసంస్థలు వాయిదా వేయడంలో అర్థం ఉంది. అప్పట్లో కరోనా ప్రారంభమైన రోజులవి. రోజురోజుకూ వైరస్ ఉధృతమవుతుండడంతో ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ సమర్థించారు. ఇప్పుడు కేసులు రోజురోజుకూ తగ్గుముఖం పడుతున్నాయి. పైగా చాలా రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరుగుతున్నాయి. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో జీహెచ్ఎంసీ ఎన్నికలు చేపట్టారు.
మన రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరించడం హాస్యాస్పదంగా ఉంది. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కూడా సంఘాల నేతలు బుద్ధి తెచ్చుకోలేదు. రాజ్యాంగ సంక్షోభం ఏర్పడుతుందన్న భయంతో జగన్ సర్కారు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌ను రంగంలోకి దించింది. ఆయన గత నెల 28న ఉద్యోగ సంఘాల నేతలు వెంకట్రామిరెడ్డి, చంద్రశేఖర రెడ్డి, బొప్పరాజు వెంకటేశ్వర్లు తదితరులతో భేటీ అయ్యారు.
సుప్రీంకోర్టు తీర్పు మేరకు.. స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన షెడ్యూల్ మేరకు నిర్వహించాల్సిందేనని.. ఉద్యోగులందరూ విధుల్లో పాల్గొనాల్సిందేనని వారికి స్పష్టం చేశారు. అనంతరం ఆయా నేతలు మీడియాతో మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నొక్కారు. ‘‘‘భయాందోళనలకు గురి అవుతున్న ఉద్యోగుల వాదనలకు న్యాయం జరగలేదు. అయినప్పటికీ సుప్రీం తీర్పును గౌరవించి ఎన్నికలకు సహకరిస్తాం.
ఉద్యోగులు ప్రాణభయంతో అల్లాడుతుంటే, మాకు రాజకీయం అంటగట్టడం దురదృష్టకరం. కరోనా ప్రాణభయంతో ఎన్నికలను బహిష్కరించాలని, సమ్మె చేయాలని ఉద్యోగులు భావించారు. అంతలా వారు బాధపడుతున్నారు. తమ ఆరోగ్యాల విషయంలో ఆందోళన చెందుతున్నారు. అయితే, ప్రభుత్వం త గిన రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చినందున ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తాం.
మేం ఎన్నికలను వ్యతిరేకించలేదు. ఉద్యోగుల ఆవే ద నను దృష్టిలో ఉంచుకునే ఎన్నికలను వాయిదా వేయాల్సిందిగా మాత్రమే కోరాం’ అని వ్యాఖ్యానించారు. వీరి మాటలనుబట్టే వీరి వెనుక ప్రభుత్వం ఉందన్న విషయం తేలిపోతోందని ఉద్యోగులే అంటున్నారు.