ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాల పేరుతో పేదలకు డబ్బులు అందజేసి కొత్త తరహా క్విడ్ ప్రోకోకు తెరలేపారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. జగన్ ఇంతకుముందు చేసింది క్విడ్ ప్రొ కొ అవునో కాదో కోర్టే తేల్చాలి గాని ఇపుడు చేస్తున్నది మాత్రం అసలైన క్విడ్ ప్రొ కొ అని ఉండవల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం రాత్రి ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో, కాంగ్రెస్ మాజీ ఎంపీ, జగన్ ప్రభుత్వం ఫెయిల్యూర్ గురించి మాట్లాడారు. ఓటుకు నోటు రాజకీయం నడుస్తోంది. డబ్బు పొందిన వారందరూ పూర్తిగా వైఎస్సార్సీపీకి ఓటు వేస్తారని జగన్ భావిస్తున్నాడని, అతను పక్కా బిజినెస్ మ్యాన్ అని ఉండవల్లి పేర్కొన్నారు.
అతను ఏదీ ఊరికే ఇవ్వడు. ఆయన ఒక వ్యాపారి. ఓట్లు కొత్త రకంగా కొనుక్కుంటున్నారు. కానీ చంద్రబాబు పది వేలు పసుపు కుంకుమ ఇచ్చినా ఫెయిలై న విషయాన్ని గుర్తించాలని అన్నారు.
ఉచిత పథకాల పేరుతో ఆర్థిక క్రమశిక్షణ పాటించకపోవడం వల్లే రాష్ట్రం నేడు మూల్యం చెల్లిస్తోందన్న వాదన వినిపిస్తోంది. లాభం లేకుండా ఏదీ సాధించలేని వ్యాపారవేత్త సీఎం జగన్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.