https://www.youtube.com/watch?v=0Sx-uZ13qRQ&ab_channel=ABNTelugu
ఇరు తెలుగు రాష్ట్రాల్లోని సమకాలీన రాజకీయ నాయకుల్లో మాజీ ఎంపీ, సీనియర్ పొలిటిషియన్ ఉండవల్లి అరుణ్ కుమార్ కు ఉన్న ప్రత్యేకత వేరు. సుత్తి లేకుండా …ముక్కు సూటిగా …చెప్పదలుచుకున్న విషయాన్ని కన్విన్సింగ్ గా చెప్పగలిగిన నేర్పు ఉన్న నేత ఉండవల్లి. అంతటి వాగ్ధాటి…విషయ పరిజ్ఞానం ఉన్న ఉండవల్లిని పార్టీలకతీతంగా గౌరవిస్తారన్న టాక్ రాజకీయ వర్గాల్లో ఉంది.
అయితే, అధికార పక్షం, విపక్షం అన్న తేడా లేకుండా విమర్శలు గుప్పించడంలో ముందుండే ఉండవల్లిపై దాదాపుగా చాలా మందికి ఓ సాఫ్ట్ కార్నర్ ఉంది. గతంలో జగన్ పై సందర్భానుసారంగా పదునైన విమర్శలు చేసిన ఉండవల్లి తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఏపీ ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, జగన్ ఇష్టానుసారం అప్పులు చేస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. ఇప్పటివరకు జగన్ సర్కార్ రూ.6 లక్షల కోట్ల అప్పు చేసిందని, అమరావతిని తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారని ఆరోపించారు.
ఎంతో మంది సలహాదారులున్నప్పటికీ జగన్ సర్కార్ పాలనలో ఆర్థిక దయనీయ పరిస్థితులు ఉండటం దారుణమన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే…ఏపీకి గడ్డుకాలం తప్పదని వార్నింగ్ ఇచ్చారు. ఎక్కడ పడితే అక్కడ అప్పులు చేసే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారిపోయిందని ఉండవల్లి విమర్శించారు. ‘వన్ నేషన్.. వన్ రేషన్ కార్డుకు అంగీకరించిన ఏకైక రాష్ట్రం ఏపీ అని అన్నారు. పోలవరంపై వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, ప్రాజెక్ట్ పనులు పూర్తికాకుండానే హడావుడి ప్రకటనలు చేయడం సరికాదన్నారు.
పోలవరం పనుల్లో పురోగతి లేదని, ప్రాజెక్ట్‌కు సంబంధించి రూ.4,068 కోట్లు కొర్రీలు వేశారని, పనులు పూర్తి కాకున్నా….మంత్రులు హడావుడి చేస్తున్నారని విమర్శించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నప్పుడు పోలవరం ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే ఉందని అన్నారు. నిర్వాసితులకు ఇప్పటికీ పరిహారం అందడం లేదని, పోలవరం నిధులపై రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చర్చ జరుగుతోందని అయినా ఫలితం లేదని అన్నారు.