టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సినీ రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనను పద్మ విభూషణ్ తో కేంద్ర ప్రభుత్వం సత్కరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరుకు మరో అరుదైన గౌరవం దక్కింది. యూనైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వం నుంచి చిరంజీవి తాజాగా గోల్డెన్ వీసా అందుకున్నారు. దీంతో, చిరంజీవికి ఆయన కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
వివిధ రంగాల్లో విశేష సేవలందించిన వారికి యూఏఈ ప్రభుత్వం 10 ఏళ్ల కాలపరిమితితో ఈ వీసా అందజేస్తుంది. షారుఖ్ ఖాన్, అల్లు అర్జున్, దుల్కర్ సల్మాన్, త్రిష, అమలాపాల్, మోహన్‌లాల్, మమ్ముట్టి, టొవినో థామస్ లు ఆల్రెడీ గోల్డెన్ వీసా అందుకున్నారు.
కాగా, ఎన్టీఆర్ 101వ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ చిరంజీవి నివాళులు అర్పించారు. “కొందరి కీర్తి అజరామరం. తరతరాలు శాశ్వతం. భావితరాలకు ఆదర్శం. నందమూరి తారక రామారావు గారిని ఈ రోజు గుర్తుచేసుకుంటూ.. వారు ప్రజా జీవితంలో చేసిన సేవలకు భారతరత్న పురస్కారం సముచిత గౌరవం అని భావిస్తున్నాను. తెలుగు వారి ఈ చిరకాల కోరికని కేంద్ర ప్రభుత్వం తప్పక మన్నిస్తుందని ఆశిస్తున్నాను” అని చిరు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వడం సముచితమని చిరు అభిప్రాయపడ్డారు.