సంక్రాంతి సినిమాల్లో తిరుగులేని విజయం సాధించి ఆల్ టైం బ్లాక్ బస్టర్లలో ఒకటిగా నిలిచిన సినిమా.. హనుమాన్. పండక్కి ముందు సంక్రాంతి చిత్రాల్లో ఇదే నంబర్ వన్ అవుతుందని ఎవరైనా అంటే నవ్వుకునేవాళ్లమేమో. సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘గుంటూరు కారం’ను కూడా వెనక్కి నెట్టి.. రెండో వారంలోనూ వసూళ్ల పంట పండించుకుంటూ ముందుకు సాగిపోతోందీ చిత్రం. ‘హనుమాన్’ చివర్లో సీక్వెల్‌కు హింట్ ఇస్తూ.. ‘జై హనుమాన్’ పేరుతో పార్ట్-2ను అనౌన్స్ చేశాడు ప్రశాంత్ వర్మ. 2025లోనే ఆ చిత్రం విడుదల అవుతుందని కూడా అతను ప్రకటించాడు. వచ్చే ఏడాది రిలీజ్ అంటే.. త్వరలోనే సీక్వెల్ సెట్స్ మీదికి వెళ్లిపోతుందేమో అనుకున్నారు అందరూ. కానీ ప్రశాంత్ ఆలోచన వేరుగా ఉంది. ‘జై హనుమాన్’ 2025లో రిలీజవుతుందని చెబుతూనే.. అంతకంటే ముందు తన నుంచి రెండు సినిమాలు వస్తాయని అతను ప్రకటించాడు.
ప్రశాంత్ ఇప్పటికే ‘అధీర’ పేరుతో ఒక సినిమా అనౌన్స్ చేశాడు. అనౌన్స్మెంట్ తర్వాత దాని గురించి ఏ అప్డేట్ లేదు. ఆ సినిమా లైన్లోనే ఉందని చెబుతూనే.. దీంతో పాటు ‘మహంకాళి’ పేరుతో మరో సినిమా కూడా చేయబోతున్నట్లు ప్రశాంత్ వెల్లడించాడు. ఇవి రెండూ పూర్తయ్యాక ‘జై హనుమాన్’ మూవీని పట్టాలెక్కిస్తానని.. చెప్పినట్లే వచ్చే ఏడాది సినిమా రిలీజవుతుందని అతను స్పష్టం చేశాడు. ఇక ‘జై హనుమాన్’ విశేషాల గురించి మాట్లాడుతూ.. అది ‘హనుమాన్’ కంటే వంద రెట్లు భారీగా ఉంటుందని చెప్పాడు. ఆ కథ మొత్తం హనుమంతుడి చుట్టూనే తిరుగుతుందని.. అందులో హీరో తేజ సజ్జ కాదని చెప్పాడు ప్రశాంత్. హనుమంతు పాత్ర కొనసాగినప్పటికీ.. లీడ్ రోల్ హనుమంతుడిదే అని చెప్పాడు. ఈ పాత్రలో ఒక స్టార్ హీరో నటిస్తాడని.. అదెవరన్నది తర్వాత వెల్లడిస్తామని ప్రశాంత్ ఊరించే స్టేట్మెంట్ ఇచ్చాడు.