ఏపీ ప్రతిపక్షం వైసీపీ కి ఒకే రోజు రెండు భారీ దెబ్బలు తగిలాయి. దీంతో సీనియర్ నాయకులు ఎవరూ మీడియా ముందుకు వచ్చేందుకు కూడా జంకుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తాజాగా.. చోటు చేసుకున్న ఈ రెండు పరిణామాలపైనా వైసీపీ నేతలు అసలు ఎక్కడా స్పందించకపోవడం గమనార్హం. వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్లో అరెస్టు చేయడం.. పెద్ద సంచలనంగా మారింది. రోజు రోజంతా కూడా.. ఈ వార్త రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టించింది. వాస్తవా నికి వంశీ .. తనపై నమోదైన టీడీపీ కార్యాలయంపై దాడి కేసు నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలోనే హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేశారు. ఇది విచారణలో ఉండగానే.. వంశీపై కుట్ర, కిడ్నాప్ కేసులు నమోదు కావడం.. ఈ కేసుల్లో ఆయన ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నించేలోగానే పోలీసులు హుటాహుటిన ఆయనను అరెస్టు చేయడం సంచలనంగా మారింది. సాధారణంగా.. కేసు నమోదైనప్పుడు.. 41ఏ కింద ముందస్తు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంటారు. అయితే.. 7 సంవత్సరాల కన్నా ఎక్కువ కాలం జైలు పడే సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తే మాత్రం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వరు. ఇప్పుడు వంశీ విషయంలో అలానే జరిగింది.
దీంతో సదరు కేసు నమోదైన విషయం తెలిసిన కొన్ని గంటల్లోనే వంశీ అరెస్టయ్యాయి. ఇది హఠాత్పరిణామం కావడంతో వైసీపీ నేత తేరుకోలేక పోయారు. ఈ పరిణామం.. వైసీపీని కుదేలయ్యేలా చేసింది. దీంతో నాయకులు ఎవరూ వంశీని సమర్థించే పరిస్థితి లేకుండా పోయింది. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ సమర్థించే ప్రయత్నం చేసినా.. అది కూడా తేలిపోయింది. ఇక, మరో కీలక కేసు.. మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఉదంతం. దెందులూరు ఎమ్మెల్యేచింతమనేని ప్రభాకర్ చౌదరి కారును అడ్డగించారన్న కేసుతో పాటు.. ఆయనపై హత్యాయత్నం చేశారన్న అభియోగాలతో అబ్బయ్యపై కేసు నమోదైంది.
ఈ రెండు పరిణామాలు కూడా.. ఒకే రోజు జరగడంతోపాటు వైసీపీ నేతలు సమర్థించుకునే అవకాశం కూడా లేకుండా పోవడంతో పార్టీ నాయకులు దిగాలు పడ్డారు. మరోవైపు పార్టీ అధినేత జగన్ ఈ రెండు ఉదంతాలపైనా కేవలం మొక్కుబడిగా స్పందించి కూటమి సర్కారుపై విమర్శలు చేసి ఊరుకున్నారు. దీంతో ఇక, సీనియర్లు, జూనియర్లు.. అనే తేడా లేకుండా ఎవరూ కూడా మీడియా ముందుకు రావడం కానీ.. నేతలను సమర్థించే ప్రయత్నం కానీ చేయకపోవడం గమనార్హం. అంతేకాదు.. వచ్చే రోజుల్లో మరిన్ని అరెస్టులు తప్పవన్న సంకేతాలు కూడా వస్తున్న నేపథ్యంలో నాయకులు గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.