ట్విట్టర్(ప్రస్తుతం ఎక్స్) ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ఒకటి. ప్రపంచ కుబేరుడు, టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ 2022 అక్టోబర్‌లో ట్విట్టర్‌ను కొనుగోలు చేశాక చాలా మార్పులు జరిగాయి. ఆ కంపెనీ పేరును ఎక్స్ గా మార్చడంతో పాటు లోగోను ‘X’ గా ఛేంజ్ చేశారు. అయినప్పటికీ ట్విట్టర్ పేరును మరియు దాని గుర్తింపుగా ఉన్న నీలి రంగు బుల్లి పిట్టను యూజర్లు ఏమాత్రం మరచిపోలేరు.
అయితే ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న పాత ట్విట్టర్ లోగో బ్లూ బర్డ్ తాజాగా వేలానికి వచ్చింది. ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ నిర్వహించిన వేలంపాటలో ట్విట్టర్ పిట్ట భారీ ధర పలికింది. ఓ వ్యక్తి ఏకంగా 35వేల డాలర్లు వెచ్చించి ఆ ఐకానిక్ బ్లూబర్డ్ లోగోను సొంతం చేసుకున్నారు. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ట్విట్టర్ పిట్ట రూ. 30 లక్షలకు అమ్ముడైంది. కానీ, లోగోను దక్కించుకున్న వ్యక్తి వివరాలు మాత్రం ఆక్షన్ సంస్థ రివీల్ చేయలేదు.
కాగా, 2006లో ఏర్పాటైన ట్విట్టర్ కు లోగోగా లైట్ బ్లూ బర్డ్ ను ఏర్పాటు చేశారు. అప్పట్లో లోగో తయారీ కోసం 15 డాలర్లు చెల్లించారు. మస్క్ సంస్థను కొనుగోలు చేయడానికి ముందు వరకు అమెరికా శాన్ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ హెడ్‌క్వార్టర్ బిల్డంగ్ గోడపై కళ్లు మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో బ్లూ బర్డ్ వెలిగిపోతూ కనిపించేది. 12 అడుగుల పొడవు, 9 అడుగుల వెడల్పు, 254 కిలోలు ఉండే ఈ ఐకానిక్ బ్లూ బర్డ్ లోగో ఇప్పుడు మరొకరి సొంతమైంది.