మూవీ ఆర్టిస్ట్ అసోసియేన్ (మా) ఎన్నికలు ఈ ఏడాది రసవత్తరంగా మారిన సంగతి తెలిసిందే. మా అధ్యక్షబరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, హీరో మంచు విష్ణులు పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకరిపై ఒకరు సంచలన ఆరోపణలు చేసుకుంటున్న వైనం హాట్ టాపిక్ గా మారింది. ఇక, ఈ ఎన్నికల్లో ప్రధానంగా లోకల్, నాన్ లోకల్ అంటూ ఇండస్ట్రీ రెండు వర్గాలుగా విడిపోయిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎన్ని విమర్శలు వచ్చినా సరే… సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు తీసిపోని విధంగా పోటాపోటీగా ప్రకాష్ రాజ్, విష్ణులు మాటల యుద్ధం కొనసాగిస్తున్నారు. దీంతో, ఈ ఇద్దరిలో గెలుపెవరిదన్న ఉత్కంఠ ఏర్పడింది. అక్టోబర్ 10న జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆదివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకూ పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్ కోసం జూబ్లీ హిల్స్ పోలీసులతో పాటు 3 ప్లాటూన్ల బలగాల్ని మోహరించారు.
మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికలు వాయిదా వేయాలంటూ జూనియర్ ఆర్టిస్టులు డిమాండ్ చేస్తున్న వైనం షాకింగ్ గా మారింది. పోలింగ్‌లో 3,609 జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనాల్సి ఉందని, కానీ అందులో చాలా మంది యూనియన్ సభ్యులు కాని వారున్నారని జూనియర్ ఆర్టిస్ట్ సంఘం నేతలు ఆరోపించారు. ఆ జాబితాలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించిన తర్వాతే ‘మా’ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
అంతేకాదు, ఈ ప్రకారం వారు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బైలాస్కు విరుద్ధంగా పని చేస్తున్న వల్లభనేని అనిల్‌కుమార్, స్వామిగౌడ్, సినీ పరిశ్రమకు సంబంధం లేని శేషగిరిరావు నామినేషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తేేలిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎలాంటి అజెండా లేకుండానే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.