ఆ మతగురువుకు వెయ్యి మంది గర్ల్‌ఫ్రెండ్స్.. ఉన్నారట. ఈ తప్పు చేసినందుకు ఆ దేశ కోర్టు అతనికి 1075 ఏళ్ల జైలుశిక్ష విధించిందట. మీరు చదివింది తప్పు కాదు. అక్షరాల నిజం. ఒక మతగురువుకు సంబంధించిన సంచలన అంశాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సమాజంతో సత్ ప్రవర్తనకు.. అందరిని మంచిదారిలో వెళ్లేలా చేసేందుకు కీలక భూమిక పోషించాల్సిన మత గురువు అంతకు మించిన ఆరాచకంతో పాటు ఇష్టారాజ్యంగా వ్యవహరించటమే కాదు.. చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నందుకు భారీ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి.
వివాదాస్పద ఇస్లాం మత ప్రబోధకుడిగా.. విలాసవంతమైన జీవితాన్ని గడిపే అద్నన్ అక్తర్ కు టర్కీ కోర్టు దిమ్మ తిరిగిపోయేలా షాకిచ్చింది. మైనర్లపై లైంగిక దాడులు.. ఆర్మీ గూఢచర్యం.. బ్లాక్ మొయిలింగ్ తదితర కేసుల్లో దోషి అయిన ఆయనకు మొత్తంగా 1075 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ షాకింగ్ తీర్పును ఇచ్చారు. మహిళల మధ్య కూర్చొని విలాసవంతమైన జీవితాన్ని ప్రతిబింబించేలా.. ప్రైవేటు చానల్ ద్వారా మతపరమైన బోధనలు చేయటం అక్తర్ ప్రత్యేకత. తన చుట్టూ ఉన్న మహిళలతో అసభ్యకర రీతిలో వ్యవహరిస్తూ ఎప్పుడు వివాదాల్లో ఉండేవాడు.
అతడి వ్యవహరాలపై ఫోకస్ చేసిన టర్కీ ప్రభుత్వం అతడ్ని 2018లో అరెస్టు చేశారు. దాదాపు పది కేసుల్లో దోషిగా తేల్చిన అక్కడి న్యాయస్థానం.. 1075 ఏళ్ల జైలును విధించారు. ఈ మత గురువుకు ఫాలోవర్లుగా వ్యవహరించే పదమూడు మందికి సైతం కఠిన కారాగార శిక్షను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే తనపై చేసే నేరారోపణల్ని 64 ఏల్ల అద్నన్ ఖండిస్తారు. తాను ఏ తప్పు చేయలేదంటారు.
తాజాగా తనకు విధించిన శిక్షపై అప్పీలు చేస్తానని చెప్పే ఆయన.. తనపై వచ్చిన ఆరోపణల్ని తనదైన శైలిలో సమర్థించుకోవటం గమనార్హం.
మహిళల్ని చూస్తే తన గుండె ప్రేమతో ఉప్పొంగిపోతుందని.. ప్రేమించటం మానవ సహజ లక్షణమని పేర్కొంటారు. తనకు దాదాపు వెయ్యి మందికి పైగా గర్ల్‌ఫ్రెండ్స్ ఉన్నట్లు పేర్కొన్నారు. ‘‘వారందరిని సంతోషపెట్టగల అసాధారణ లైంగిక సామర్థ్యం నాకుంది’ అంటూ చెత్తగా వ్యాఖ్యానించే అతగాడికి.. కోర్టు సరైన శిక్ష విధించినట్లుగా పలువురు వ్యాఖ్యానించటం గమనార్హం.