సాయానికి ప్రతి సాయం చేయకపోగా వెన్నుపోటు పొడిచి భారత్ ఆగ్రహానికి గురైంది టర్కీ. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కు బహిరంగంగా మద్దతు పలికిన టర్కీ.. భారత్ పై దాడులు చేసేందుకు డ్రోన్లు, మిస్సైల్స్ సరఫరా చేసి పాక్ కు సహాయం కూడా చేసింది. అయితే అందుకు ఇప్పుడు టర్కీ భారీ మూల్యం చెల్లించుకుంటుంది. ప్రస్తుతం ఇండియాలో టర్కీపై వ్యతిరేకత తారా స్థాయిలో పెరుగుతుంది. దేశవ్యాప్తంగా బాయ్‌కాట్ టర్కీ నిదానం ఊపందుకుంది.
ఓవైపు కేంద్ర ప్రభుత్వం టర్కీకి గట్టి బుద్ధి చెప్పే దిశగా చర్యలు తీసుకుంటుండగా.. మరోవైపు భారతీయులు స్వచ్ఛందంగా టర్కీ పై ఆంక్షలు అమలు చేస్తున్నారు. ఈ ప్రభావం టర్కీ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా టర్కీ అర్జించే ఆదాయం ఈ ఏడాది అమాంతం పడిపోయింది. గత కొన్నేళ్ల నుంచి విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటున్న భారతీయుల సంఖ్య భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఇక్కడి సంపన్నుల వివాహాలకు టర్కీ ఒక బెస్ట్ స్పాట్ గా మారింది.
2018లో 13 భారతీయ జంటలు టర్కీలో వివాహం చేసుకోగా.. 2024 నాటికి ఆ సంఖ్య ఏకంగా 50కి చేరింది. అక్కడ ఒక్కో వివాహానికి మన ఇండియన్స్ దాదాపుగా 3 మిలియన్ డాలర్ల నుంచి 8 మిలియన్ డాలర్ల(సుమారు రూ. 25 కోట్లు నుంచి రూ. 68 కోట్లు) వరకు ఖర్చు చేస్తున్నారు. దాంతో డెస్టినేషన్ వెడ్డింగ్‌ల కోసం టర్కీకి వెళ్లే భారతీయుల ద్వారా ఆ దేశం ఏడాదికి సగటున 140 మిలియన్ డాలర్లను అర్జీస్తోంది.
అయితే ప్రస్తుతం ఇండియా వైడ్‌గా బాయ్‌కాట్ టర్కీ క్యాంపెయిన్ జరుగుతోంది. దీంతో ఇప్పటికే భారత్‌కు చెందిన వేల మంది టూరిస్టులు తమ టర్కీ పర్యటనను రద్దు చేసుకున్నారు. మరోవైపు అక్కడ డెస్టినేషన్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకున్న ఇండియన్స్ కూడా వెనక్కి తగ్గుతున్నారు. ఈ ఏడాది టర్కీలో వివాహం చేసుకోవడానికి సుమారు ముప్పై భారతీయ జంటలు ప్రణాళికలు సిద్ధం చేసుకోగా.. ప్రస్తుత ఉద్రిక్తతల నేపథ్యంలో వారంతా తమ ప్లాన్ ను క్యాన్సిల్ చేసుకుంటున్నారట. ఫలితంగా టర్కీ దేశం సుమారు 90 మిలియన్ డాలర్ల(ఇండియన్ కరెన్సీలో రూ. 770 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయినట్లు నిపుణులు చెబుతున్నారు. మొత్తంగా భారతీయులు కొట్టిన ఈ దెబ్బకు టర్కీ విలవిలమంటోంది.