ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను తప్పుదారి పట్టించి వారిని మోసం చేశారని తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రమణ ఆరోపించారు. నియంత్రిత సాగు విధానం అని చెప్పి… రైతులకు కొన్ని పంటలు సూచించారని, వాటిని వేసిన వారు తీవ్రంగా నష్టపోయారని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆరోపించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ కి దీనిపై ఒక బహిరంగ లేఖ రాశారు రమణ. నియంత్రిత సాగు విధానంలో 24 లక్షల ఎకరాల్లో సన్న వరి సాగు చేశారు రైతులు. కానీ సన్న రకాల వరి కోతలు ప్రారంభమైనా ప్రభుత్వం ఇప్పటివరకు మద్దతు ధర ప్రకటించలేదు. ప్రభుత్వ అలసత్వం వారి కొంప ముంచుతోందన్నారు.
కేంద్రం క్వింటా వరికి రూ.1,888 ధర ప్రకటించింది. ఇప్పుడు సన్న వరిని కూడా అదే ధరకు కొంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రభుత్వం నుంచి మద్దతు ధరపై ఏ ప్రకటన రాకపోవడంతో రైతులు తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఈ మాత్రం దానికి రైతులను తప్పుదారి పట్టించడం ఎందుకు అని ఆయన నిలదీశారు.
గతంలో సన్న ధాన్యానికి మిల్లర్లే క్వింటాకు రూ.2,500 ఇచ్చేవారు. ఇప్పుడు ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు ప్రతి ఎకరాకు రూ.20000 నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ధాన్యం కొనుగోళ్లపై తమ విధానం వెల్లడించకపోతే రైతుల తిరుగుబాటుతప్పదన్నారు.