దిగ్గజ సోషల్ మీడియాల్లో ఒకటైన ట్విటర్ తాజాగా సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. తన తీరుతో తరచూ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విటర్ ఖాతాను శాశ్వితంగా నిషేధాన్ని విధిస్తున్నట్లుగా ఆ సంస్థ పేర్కొంది. ఇటీవల ట్రంప్ చేసిన ట్వీట్లను నిశితంగా పరిశీలించిన అనంతరం ఈ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ప్రకటించింది. హింసను ప్రేరేపించే ప్రమాదం ఉన్నందున.. ఆ అకౌంట్ ను శాశ్వితంగా నిలిపివేసినట్లుగా ట్విటర్ తాజాగా తన బ్లాగ్ లో పేర్కొంది.
ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్ని ధ్రువీకరించేందుకు అమెరికన్ కాంగ్రెస్ సమావేశం కావటం.. ఆ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు పలువురు యూఎస్ క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకు రావటంతో ఘర్షణ చెలరేగింది. ఈ ఉదంతంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు.అంతేకాదు.. ఈ ఉదంతంలో గాయపడ్డ పోలీసు అధికారి తాజాగా మరణించారు. ఓవైపు క్యాపిటల్ భవనంలో బైడెన్ ఎన్నిక గురించి సమావేశం జరుగుతుండగా.. మరోవైపు ట్రంప్ తన మద్దతుదారుల్ని మరింత రెచ్చగొట్టేట్లుగా ఆయన వ్యవహరించారన్న విమర్శ ఉంది.
ఇంటికి వెళ్లాలని అభిమానులకు చెబుతూనే.. ఎన్నికల్లో మోసం జరిగిందని పేర్కొంటూ ఒక వీడియోను పోస్టు చేసిన ట్రంప్.. తన అభిమానులకు ఐ లవ్యూ చెబుతూ మరింత రెచ్చగొట్టారు. దీంతో.. ట్రంప్ మద్దతుదారులు మరింత చెలరేగిపోయి.. క్యాపిటల్ భవనంలోకి చొచ్చుకెళ్లి భారీ హంగామా క్రియేట్ చేయటం.. పెను ఉత్పాతం త్రుటిలో తప్పటం తెలిసిందే. దీనికి సంబంధించిన వీడియోల్ని ట్విటర్ తో పాటు ఫేస్ బుక్.. యూట్యూబ్ లు తొలగించాయి.అప్పట్లో ట్విటర్ ట్రంప్ ఖాతాను 12 గంటల పాటు నిలిపివేసింది. ఇదిలా ఉండగా.. తాజాగా ట్రంప్ ఖాతాలోని పోస్టుల్ని పరిశీలించిన ట్విటర్.. ‘మద్దతుదారులు జరిపిన తిరుగుబాటుతో మేం బాధ పడుతున్నాం’ అంటూ ట్విటర్ సీఈవో అనేక వందల మంది ఉద్యోగులకు లేఖ రాశారు. అదే సమయంలో..ట్రంప్ ఖాతాను శాశ్వితంటా బ్యాన్ విధిస్తూ సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు.