మీ ఇంట్లో మీరు ఉన్నారు. పక్కింటోడు ఇల్లు కట్టుకునే క్రమంలో మీ ఇంటికి డ్యామేజ్ చేశాడు. అప్పుడేం చేస్తారు? ఇంటి విషయానికే ఇంతలా రియాక్టు అయినప్పుడు గడిచిన ఏడాదిన్నరగా ప్రపంచం తల్లడిల్లి పోవటం.. కోట్లాది మంది కరోనా బారిన పడటం.. లక్షలాది మరణాలు.. కోట్లాది కుటుంబాలు ఆప్తుల్ని పోగొట్టుకోవటం.. ప్రపంచ ఆర్థిక స్థితి గతులే తలకిందులైపోయి.. సగటు జీవి బతుకు బరువెక్కిపోయింది. దీనంతటికి కారణం చైనానే. కొవిడ్ అన్నది పొరపాటునో.. గ్రహపాటునో వూహాన్ మార్కెట్లో పుట్టలేదని.. ఆ మహానగరంలోని రహస్య ల్యాబ్ నుంచి లీకైన వైరస్.. ప్రపంచాన్ని తల్లడిల్లేలా చేస్తుందన్న విషయంపై ఇప్పుడిప్పుడే అందరికి క్లారిటీ వస్తోంది.
దీనికి ఇప్పటికి చైనా సమాధానం చెప్పని పరిస్థితి. ఇంత దారుణానికి పాల్పడినందుకు కనీసం చింత కూడా లేని ఆ దేశం.. ప్రపంచానికి నష్టపరిహారం చెల్లించదా? అన్నదిప్పుడు ప్రశ్న. అలా డిమాండ్ చేసే దమ్ము.. ధైర్యం ప్రపంచంలోని ఏ దేశానికి.. ఏ దేశాధినేతకు లేదు. ఇలాంటి వేళ.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమి చెందిన డొనాల్డ్ట్ ట్రంప్ తాజాగా కీలక డిమాండ్ ను తెర మీదకు తీసుకొచ్చారు.కొవిడ్ కారణంగా ప్రపంచానికి జరిగిన నష్టానికి చైనా పరిహారం చెల్లించాల్సిందేనని తేల్చారు.
తాజాగా మాట్లాడిన ఆయన.. అమెరికాకు.. ప్రపంచ దేశాల ముందు సరికొత్త డిమాండ్లను పెట్టారు. ‘‘సమయం ఆసన్నమైంది. కరోనాకు చైనా ప్రభుత్వం బాధ్యత వహించాలి. జరిగిన పరిణామాలకు చైనా అనుభవించాలని ప్రపంచం మొత్తం ముక్తకంఠంతో చెప్పాలి. అన్ని దేశాలు కలిసి పని చేసి చైనాకు కనీసం 10 ట్రిలియన్ డాలర్ల (731లక్షల కోట్ల రూపాయిల) పరిహారం ఇవ్వాలి. నిజానికి వారు చేసిన నష్టానికి అది కూడా చాలా తక్కువ’’ అని పేర్కొన్నారు.
చైనా లాంటి మొండి దేశం నుంచి కరోనా పరిహారం పొందటం సాధ్యమయ్యే పనేనా? అన్న సందేహం రాక మానదు. దానికి కూడా ఉన్న అవకాశాల్ని చెప్పుకొచ్చారు ట్రంప్. ‘‘చైనా నుంచి పరిహారం పొందటానికి వీలుగా.. వారి నుంచి తీసుకున్న అప్పుల చెల్లింపును నిలిపివేయాలి. దానినితొలి విడత పరిహారం చెల్లింపుగా భావించాలి. ప్రపంచ దేశాలు చైనాకు డబ్బులు చెల్లించకూడదు. కరోనాచాలా దేశాల్ని ఆర్థికంగా సర్వనాశనం చేసింది. అలాంటి దేశాలకు చైనా డబ్బు చెల్లించాలి’’ అని డిమాండ్ చేశారు.
చైనా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై అమెరికా 100 శాతం టారిఫ్ లను విధించాలని కోరారు. పనిలో పనిగా తన రాజకీయ ప్రత్యర్థి.. అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మీద ఘాటు విమర్శలు చేశారు. చైనా కమ్యునిస్టు పార్టీ నుంచి మిలియన్ల కొద్దీ డాలర్లు తీసుకొని అమెరికా ప్రజలకు అబద్ధాలు చెప్పిందన్నారు. పెద్ద టెక్ కంపెనీలు.. ఫేక్ మీడియా దీని గురించి పట్టించుకోదన్నారు. వైరస్ ఎక్కడి నుంచి వచ్చిందనే విషయంలో ఫౌఛీ తన జీవితంలోనే అతి పెద్ద తప్పు చేసినట్లుగా మండిపడ్డారు. మిగిలిన విషయాల్లో ట్రంప్ తీరు ఎలా ఉన్నా.. చైనా కరోనా విషయంలో మాత్రం ఆయన మాటలు కొత్త ఆలోచనలకు తెర తీయటమే కాదు.. చైనా నుంచి పరిహారం రాబట్టాలన్న భావన రాక మానదు. మరి.. ప్రపంచం ట్రంప్ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తుందో చూడాలి.