అమెరికా మాజీ అధ్యక్షుడు, అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న డోనాల్డ్ ట్రంప్ పై క్రూక్స్ అనే ఆగంతకుడు హత్యాయత్నం చేసిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తున్న సందర్భంగా ట్రంప్ పై అతడు కాల్పులు జరపడంతో బుల్లెట్ ఆయన కుడి చెవి పైభాగం నుంచి దూసుకుపోయింది. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు అప్రమత్తం కావడంతో ట్రంప్ నకు ప్రమాదం తప్పింది. ఆ తర్వాత వెంటనే స్పందించిన పోలీసులు ట్రంప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ట్రంప్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.
అయితే, పోలీసులు వెంటనే స్పందించి ట్రంప్ పై కాల్పులు జరిపిన క్రూక్ ను అక్కడికక్కడే మట్టుబెట్టారు. రిపబ్లికన్ పార్టీకి క్రూక్స్ మద్దతుదారుడేనని పోలీసులు గుర్తించారు. అతడి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో క్రూక్స్ ఇంటి దగ్గర భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఈ కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్పందించారు. ట్రంప్ నకు ప్రెసిడెంట్ బైడెన్ ఫోన్ చేసి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అమెరికాలో ఇటువంటి హింసాత్మక ఘటనలకు తావులేదని అన్నారు.
ఇక, తన మిత్రుడు డోనాల్డ్ ట్రంప్ పై కాల్పులు జరిపిన ఘటనపై భారత ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. ఈ దాడి పట్ల తీవ్ర ఆందోళన చెందానని, ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని మోడీ అన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై ట్రంప్ తొలిసారిగా స్పందించారు. గన్ షాట్ శబ్దాలు విన్నప్పుడు ఏదో తప్పు జరుగుతున్నట్లుగా అనిపించిందని, అంతలోనే మరో బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లినట్టుగా అనిపించిందని ట్రంప్ చెప్పారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తన రక్షించారని, అప్పటికే కుడి చెవి పైభాగం నుంచి బుల్లెట్ దూసుకు వెళ్లిందని ట్రంప్ అన్నారు. సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు తనకు రక్షణ కల్పించి తన ప్రాణాలు కాపాడారని ట్రంప్ చెప్పారు.