తాజా మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలనం సృష్టించబోతున్నారా? జనవరి 20 న వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లిన ట్రంప్ దేశం కోసం అంటూ “పేట్రియాట్ పార్టీ” అనే కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించే ఆలోచన చేస్తున్నట్టు వస్తున్న వార్తలు అమెరికా సమాజాన్ని కుదిపేస్తున్నాయి.
అనేక దశాబ్దాలుగా అమెరికాలో రెండే పార్టీలు రాజ్యమేలుతున్నాయి. ప్రజలకు అయితే అది, లేకపోతే ఇది అన్నట్లు ఉంది. ట్రంప్ తాజా ఆలోచన అమెరికా కొత్త తరానికి నచ్చే అవకాశం లేకపోలేదు. సింపుల్ గా చెప్పాలంటే… భారతదేశంలో బీజేపీ ఎలా అయితే ఒక సెంటిమెంట్ తో పార్టీని నడుపుతుందో ట్రంప్ కూడా అదే శ్వేతజాతి, దేశభక్తి అన్న ఆలోచనతో పార్టీ నిర్మాణం గురించి ప్లాన్లు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
తన ఓటమిని ఇటీవలి ఎన్నికల్లో ట్రంప్ అంగీకరించలేదు. ఓటు మోసం కారణంగా గెలిచాడని… ట్రంప్ పదేపదే చెప్పారు. దీంతో చాలా అయిష్టంగా బిడెన్ ను యాక్సెప్ట్ చేసి… బలవంతంగా వైట్ హౌస్ నుంచి బయటకు వెళ్లారు.
తన వీడ్కోలు సందేశం సందర్భంగా, అమెరికా అధ్యక్షుడు ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ప్రచార నినాదాన్ని మొదలుపెట్టారు. 2016లో ట్రంప్ ను అధ్యక్షుడిని చేసిన నినాదం కూడా ఇదే.