నీళ్లు నిధులు నియామకాలు నినాదంతో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ సమాజానికి అన్యాయం జరుగుతుందని, ఉద్యోగాలు రావట్లేదనే కారణంతో స్వరాష్ట్ర ఉద్యమంలో చదువుకున్న యువత స్వచ్ఛందంగా పాల్గొంది. తెలంగాణ సాకారం కోసం బెదిరింపులను, జైళ్లను లెక్క చేయకుండా యువకులు ఉత్సాహంతో కదిలి వచ్చారు. కొంతమంది రాష్ట్ర సాధన కోసం తమ ప్రాణాలనూ బల తీసుకున్నారు. మరి ఎన్నో ఆకాంక్షలతో సాధించుకున్న తెలంగాణలో ఇప్పుడు ఏం జరుగుతోంది? నిరుద్యోగులు ఇంకా ఎందుకు రోడ్డు మీదే ఉన్నారు?
తెలంగాణ వచ్చాకైనా ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డ యువతకు నిరాశే ఎదురవుతోంది. అధికారంలోకి వచ్చిన ఏడేళ్లలో ఆశించిన స్థాయిలో అధికార టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ చేయలేదు. ఇప్పుడేమో 50 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెబుతున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే నిరుద్యోగుల సమస్యలు గుర్తుకు వస్తాయని, ఏదో కొంతకాలం హడావుడి చేసి ఉద్యోగ ఆశలు పుట్టించి మళ్లీ నిశ్శబ్దమైపోతారని కేసీఆర్పై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఉండడంతో దాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న కేసీఆర్ మరోసారి ఉద్యోగాల భర్తీ నాటకం ఆడుతున్నారని ప్రతిపక్షాలు అంటున్నాయి.
ప్రస్తుత పరిస్థితుల్లో టీఆర్ఎస్ మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వానా కాలం, యాసంగి సీజన్లలో ప్రతి గ్రామంలో 100 నుంచి 150 మందికి హమాలీ పని దొరుకుతుందని, ఇంత కంటే ప్రత్యామ్నాయ ఉపాధి ఏముంటుందని ఆయన అన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం రాదని తెలిపారు. దీంతో ఆయన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ప్రాణాలు అర్పించి తెలంగాణ రాష్ట్రం సాధించుకుంది హమాలీ పని చేసుకోవడానికా అని యువత మంత్రిపై విరుచుకుపడుతున్నారు. రాష్ట్రం కోసం కష్టపడ్డవాళ్లు ఒకరని, ఇప్పుడు అనుభవిస్తోంది మరొకరని తీవ్ర విమర్శలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్య తీర్చలేని చేతకాని ప్రభుత్వమిదని మండిపడుతున్నారు.
మరోవైపు కేంద్రంలోనూ నిరుద్యోగ సమస్యపై స్పందించిన ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల ఓ ఇంటర్య్వూలో పకోడీలు అమ్ముకోవడం కూడా ఓ రకమైన ఉపాధే అని పేర్కొనడం కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. పైగా మోడీ వ్యాఖ్యలను కేంద్ర హోం మంత్రి అమిత్షా సమర్థిస్తూ పకోడీలు అమ్ముకోవడంలో సిగ్గుపడాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. వీళ్ల వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఉద్యోగాల కల్పన చేతగాకే ప్రధాని ఇలా మాట్లాడుతున్నారంటూ విమర్శించాయి. మొత్తానికి అటు కేంద్రానికి ఇటు తెలంగాణ ప్రభుత్వానికి నిరుద్యోగులంటే లెక్క లేకుండా పోయిందని, వాళ్ల ఇబ్బందులు కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.