హైకోర్టు న్యాయవాది దంపతులు వామనరావు, నామమణిల దారుణ హత్యోదంతం ఇరు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పట్టపగలు…నడిరోడ్డుపై అందరూ చూస్తుండగా పాశవికంగా ఆ ఇద్దరు దంపతులను నరికి చంపిన వైనం ఒళ్లు గగుర్పాటుకు గురిచేసింది. వామనరావు చనిపోతూ….తనపై దాడి చేసింది కుంట శ్రీనివాస్ అని చెప్పిన మాటలు మరణ వాంగ్మూలంగా మారాయి.
ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ హత్య కేసులో కుంట శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్ర సరిహద్దుల్లో కుంట శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వామన్‌రావు హత్య కేసులో ఏ2గా ఉన్న కుంట శ్రీనివాస్ తో పాటు మరో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలోనే మంథని మండల టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఉన్న కుంట శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
అయితే, వామనరావు దంపతుల హత్యకు గుంజపడుగులో కుంట శ్రీనివాస్ తో ఉన్న వివాదాలే కారణమని తెలుస్తోంది. కుంట శ్రీనివాస్ పంచాయతీ అనుమతులు లేకుండానే ఇల్లు నిర్మిస్తున్నారంటూ ఆ ఇంటి వద్ద అనామక ఫ్లెక్సీ వెలిసింది. ప్రభుత్వ స్థలంలో అనుమతి లేకుండా ఓ కుల దైవం ఆలయ నిర్మాణాన్ని శ్రీనివాస్ చేపట్టారంటూ ఆ నిర్మాణం దగ్గర కూడా ఒక ఫ్లెక్సీ వెలిసింది. ఆ కుల సంఘం అధ్యక్షుడిగా కుంట శ్రీను ఉన్నారు.
దీంతో, ఈ రెండు విషయాల్లో శ్రీనివాస్ వామనరావు కేసులు వేస్తానని బయట చెప్పినట్లు తెలుస్తోంది. దీంతోపాటు పలు వ్యవహారాల్లో వామనరావు కుంట శ్రీనుకు, పలువురు పెద్దలకు అడ్డుగా ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మంథని ప్రాంతంలో తమకు ఇబ్బందిగా మారిన వామనరావును చంపి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు, వామనరావు చివరగా చెప్పిన మాటల వీడియోను రికార్డు చేసిన వ్యక్తిని సాక్షిగా పిలిచేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.