త్వరలో టాలీవుడ్ లో జరగబోతోన్న ‘మా’ ఎన్నికల వేడి ఆల్రెడీ రాజుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మా అధ్యక్షుడి బరిలో విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ తో పాటు, హీరో మంచు విష్ణు, నటి జీవితా రాజశేఖర్, నటి హేమలు ఉండడంతో పోరు రసవత్తరంగా మారింది. ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అంటూ విమర్శలు వస్తున్నాయి. అయితే, తాను దేశం మొత్తానికి చెందిన నటుడినని, అటువంటపుడు లోకల్, నాన్ లోకల్ ప్రశ్నే ఉత్పన్నం కాదని ప్రకాష్ రాజ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ వెల్లడించారు.
ఈ క్రమంలోనే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. చంద్రబాబు గారికి తెలంగాణలో ఏం పని , ఆంధ్రాలో రాజకీయం చూసుకోవాలి అంటూ గతంలో ప్రకాష్ రాజ్ విమర్శించిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. 100 ఏళ్ల నుంచి తెలంగాణలో ఉండేవాళ్ళని కూడా కేసీఆర్ సెట్లర్స్ గానే సంబోధించారని, అటువంటి కేసీఆర్ ను ప్రకాష్ రాజ్ సపోర్ట్ చేస్తూ గతంలో మాట్లాడారని గుర్తు చేస్తున్నారు.
ఆంధ్రులని దగాకోరులుగా చిత్రీకరిస్తూ, తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టిన కేసీఆర్ కు సన్నిహితంగా ఉన్న ప్రకాష్ రాజ్ ద్వంద్వ వైఖరి ఇపుడు బయటపడిందని కౌంటర్ ఇస్తున్నారు. ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్న గ్రామాల్లో ఒక్కటైనా ఏపీలో ఉందా అని ప్రశ్నిస్తున్నారు? 2019 లో బెంగళూరులో లోక్ సభకి పోటీ చేసిన ప్రకాష్ రాజ్ ను కన్నడ ప్రజలు తిరస్కరించారని, అందుకే తెలుగు సినీ రాజకీయాల్లో తలదూర్చారని విమర్శిస్తున్నారు.
తెలుగు ప్రజల మీద అంత ప్రేమే ఉంటే హైదరాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఉండొచ్చు కదా అని నిలదీస్తున్నారు. మా ఎన్నికల్లో సాధారణ ప్రజలకు ప్రమేయం లేదని, కానీ, ప్రకాష్ రాజ్ గారి ప్రెస్ మీట్ చూసిన తర్వాత ఈ ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.