పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి హాజరు కాకపోవడంపై కూటమి పార్టీల నేతలు ఓ రేంజ్ లో ట్రోలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఆఖరికి ఆయన సోదరి షర్మిల కూడా అసెంబ్లీకి రాకుంటే జగన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక, 60 రోజుల పాటు ఆబ్సెంట్ అయితే జగన్ శాసన సభ్యత్వం రద్దు చేసే అధికారం ఉందని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు.
అయితే, సస్పెన్షన్ వేటు పడుతుందని భయపడి, ఆ ట్రోలింగ్ తట్టుకోలేక జగన్ సభకు వస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే జగన్ అసెంబ్లీకి ఫలానా కారణంతో వస్తున్నారంటూ ఆ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తాజాగా క్లారిటీనిచ్చే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలు, రైతుల ఇబ్బందుల గురించి గళం విప్పేందుకే జగన్ అసెంబ్లీకి వెళుతున్నారని, ఎవరికో భయపడి కాదని వైవీ చెప్పారు.
వైసీపీ నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతూ కక్ష సాధిస్తోందని ఆయన ఆరోపించారు.గుంటూరు మిర్చి యార్డు పర్యటనలో జగన్ కు సరైన భద్రత కల్పించలేదని, ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. జగన్ ఎక్కడకి వెళ్లినా జడ్ ప్లస్ భద్రతను కల్పించాలని వైవీ డిమాండ్ చేశారు. జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా అవమానిస్తున్నారని.
అయితే, ప్రజా సమస్యలు ఎప్పుడూ ఉంటాయని, కానీ, ఈ రోజు సడెన్ గా జగన్ కు అవి ఎందుకు గుర్తుకు వచ్చాయన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. అసలు ఒక ఎమ్మెల్యేని గెలిపించేదే తమ సమస్యలను సభలో ప్రస్తావిస్తారన్న నమ్మకంతో. కానీ, జగన్ మాత్రం పులివెందుల సమస్యలను గాలికొదిలేసి కేవలం అసెంబ్లీలో ప్రతిపక్ష స్థానం కూడా లేని అవమానభారాన్ని తట్లుకోలేక అసెంబ్లీకి రాలేదు. ఇప్పుడు మాత్రం ప్రజల కోసం అంటూ ఎలివేషన్లు ఇస్తూ సస్పెన్షన్ వేటు తప్పించుకోవాడానికి సభకు వస్తున్నారు.