ఏపీ రాజధాని అమరావతిని ఆరు నెలల్లో అభివృద్ధి చేసి ప్రోగ్రెస్ చెప్పాలని ఏపీ హైకోర్టు కొద్ది నెలల క్రితం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అమరావతిలో నిర్మాణాలు పూర్తి చేయడానికి తమ దగ్గర డబ్బులు లేవంటూ జగన్ సర్కార్ చేతులెత్తేసింది. కోర్టు ఆదేశాలను తుంగలో తొక్కి మరీ మూడు రాజధానులే లక్ష్యం అని సొంతంగా వైసీపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు. అంతేకాదు, రాజధాని ఎక్కడ ఉండాలో నిర్ణయించుకునే హక్కు ప్రభుత్వానికి ఉందని, ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోవడం సరికాదని కూడా కొందరు వైసీపీ నేతలు గతంలో వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఓ పక్క అమరావతి రాజధాని అని కోర్టు చెబుతోంది. కానీ, వైసీపీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాత్రం రాబోయే ఏడాది నుంచి విశాఖలో పాలన ప్రారంభించేస్తామంటూ సంచలన ప్రకటన చేశారు. ఒకవేళ ఈ అసెంబ్లీ సమావేశాలలో మూడు రాజధానుల కొత్త బిల్లు ప్రవేశపెట్టిన దానిని సవాలు చేస్తూ కోర్టుకు వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. ఆ వ్యవహారం తేలి చివరికి మళ్ళీ కోర్టుల చేత వైసీపీ సర్కారు మొట్టికాలు వేయించుకునే పరిస్థితి వస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు.
ఈ నేపథ్యంలోనే గుడివాడ అమర్నాథ్ పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఆలు లేదు చూలు లేదు ఏపీకి రాజధాని విశాఖ అని అమర్నాథ్ ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అసెంబ్లీలో మాట్లాడుతూ మా ప్రాంతంలోని దేవుడు మన ప్రాంతంలో దేవుడు అంటూ దేవుడికి కూడా ప్రాంతాలను అమర్నాథ్ ఆపాదించడం ఏమిటని నెటిజన్లు ఏకిపానేస్తున్నారు. రాజకీయ పరిప్వత లేని అమర్నాథ్ వంటి నేతలకు మంత్రి పదవులు ఇస్తే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని మరికొందరు విమర్శిస్తున్నారు.
విశాఖ రాజధాని అని చెబుతున్న అమర్నాథ్ మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం కోర్టు నుంచి ఎందుకు ఉపసంహరించికుందో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఉత్తరాంధ్రపై అమరావతి రైతులు దండయాత్రకు వస్తున్నారని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించిన అమర్నాథ్ మంత్రి పదవికి అనర్హుడంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.