తన వరకు వస్తే కానీ తత్త్వం బోధ పడదని ఊరికే అనలేదు మన పెద్దోళ్లు. నోటికి వచ్చినట్లుగా మాట్లాడితే.. ఏదో ఒక రోజు ఆ మాటలకు మూల్యం చెల్లించాలన్నట్లుగానే పరిస్థితులు చోటు చేసుకోవటం గమనార్హం. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై ఇష్టారాజ్యంగా వ్యాఖ్యలు చేయటం.. ఆయన మూడో పెళ్లి చేసుకుంటే.. నలుగురు భార్యలంటూ బహిరంగ సభల్లో నోటికి వచ్చినట్లుగా మాట్లాటడం చూస్తున్నదే. పవన్ వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ..కార్లు మార్చినట్లుగా భార్యల్ని మారుస్తాడంటూ దారుణరీతిలో వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
పవన్ కల్యాణ్ ను టార్గెట్ చేయాలన్నంతనే ఈ తరహా వాదనను వినిపించటం.. వెగటు వ్యాఖ్యలు చేయటం గడిచిన కొన్నేళ్లుగా చూస్తున్నదే. తాజాగా ఏపీ మంత్రి అంబటి రాంబాబు రెండో అల్లుడు డాక్టర్ గౌతమ్ సంచలన వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తన మామ అంబటికి ఓటేయొద్దని.. అలాంటి నీచుడు.. శవాల మీద పేలాలు ఏరుకునే వ్యక్తిని ఎన్నుకుంటే సమాజం నాశనం అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయటం తెలిసిందే.
దీనిపై స్పందించిన అంబటి.. ఎవరి కుటుంబాల్లో వివాదాల్లేవు? ఎవరి కుటుంబాల్లో విభేదాలు లేవు? అంటూ చేసిన వ్యాఖ్యలు విన్నప్పుడు.. మరి పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి నోటికి వచ్చినట్లు మాట్లాడినప్పుడు.. ఆయన పెళ్లిళ్ల మీదా.. భార్యల మీదా చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేస్తున్నారు. ఎదుటోడ్ని ఎన్ని మాటలైనా అనేయొచ్చు కానీ.. తమను అన్నంతనే ఉలిక్కిపడి వివరణ ఇచ్చుకునే తీరును చూసినప్పుడు.. ఎదుటోడి మీద ఎన్నైనా అనేస్తాం. మన మీద ఎవరైనా అంటే మాత్రం ఎంతలా సుద్దులు చెప్పుకుంటామన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
అందుకే అంటారు.. రాజకీయంగా తేడా ఉంటే వాటిని ప్రస్తావించటం.. వాటిపై విరుచుకుపడటం ఓకే. అంతే తప్పించి సంబందం లేని వ్యక్తిగత అంశాల్ని ప్రస్తావిస్తూ.. వారి ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా వ్యాఖ్యానించటం తప్పన్న విషయం అంబటికి ఇప్పటికైనా అర్థమైతే మంచిదన్న మాట వినిపిస్తోంది. తనకు తాజాగా ఎదురైన అనుభవం నేపథ్యంలో అయినా అంబటి తన నోటిని అదుపులో ఉంచుకుంటారా? లేదంటే.. గతంలో మాదిరి రియాక్టు అవుతారా? అన్నది కాలమే సరైన సమాధానం చెప్పాలి.