వైసీపీ వర్సెస్ టీడీపీ అన్న రీతిలో సోషల్ మీడియా వార్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం అండ చూసుకొని టీడీపీ, జనసేన నేతలపై బూతులు, అశ్లీల పోస్టులతో వీరంగం వేసిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను చట్ట ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీలో తన తల్లిని అవమానించారని, తాము చూస్తూ ఊరుకోవాలా అని నారా లోకేష్ మండిపడ్డారు. ఈ క్రమంలోనే లోకేష్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
శాసనసభలో లోకేష్ తల్లి గారిని అవమానించినట్లు నిరూపిస్తే.. బేషరతుగా క్షమాపణ చెప్పి, రాజకీయ నిష్క్రమణ చేస్తానని అంబటి అన్నారు. ప్రస్తుత స్పీకర్ పైనా, డిప్యూటీ స్పీకర్ పైన అనుచిత వ్యాఖ్యల కేసులు పెట్టి ఆ తర్వాత మాట్లాడాలని అన్నారు. ఈ క్రమంలోనే టీడీపీ సోషల్ ీమీడియా విభాగం అంబటికి కౌంటర్ ఇచ్చింది. గతంలో నిండు సభలో అధికార గర్వంతో అంబటి నోటికి వచ్చినట్లు నారా భువనేశ్వరిని అవమానిస్తూ చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియోను పోస్ట్ చేసింది. దీంతో, రాజకీయ సన్యాసం ఎప్పుడు అంబటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. గతంలో నోటికి అడ్డూ అదుపు లేకుండా మాట్లాడిన అంబటి సిగ్గుపడాల్సింది పోయి ఆ వ్యాఖ్యలు చేయలేదంటూ బుకాయించడంపై మండిపడుతున్నారు.