నటుడిగా, దర్శకుడిగా రాఘవ లారెన్స్ మాస్ ప్రేక్షకుల్లో కొంత ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. కానీ యూత్ మాత్రం తనను అంతగా ఇష్టపడరు. సోషల్ మీడియాలో మాత్రం ఎక్కువమంది అతణ్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. అందుక్కారణం లారెన్స్ ఏ పాత్ర చేసినా అందులో చేసే ఓవరాక్షనే. దర్శకుడిగా కూడా తను తీసే సినిమాల్లో చాలా అతి కనిపిస్తుంది. తనకు నప్పే మాస్ క్యారెక్టర్లు చేస్తే ఓకే కానీ.. అతణ్ని కొంచెం క్లాస్ టచ్ ఉన్న పాత్రల్లో ప్రేక్షకులు ఊహించుకోలేరు. కానీ తెలుగు దర్శకుడు రమేష్ వర్మ లారెన్స్‌ను హీరోగా పెట్టి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ యాక్షన్ థ్రిల్లర్ ‘కిల్’ను రీమేక్ చేస్తున్నాడనే వార్త బయటికి రాగానే సోషల్ మీడియా జనాలకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇండియన్ స్క్రీన్ మీద మునుపెన్నడూ చూడని హై యాక్షన్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ సినిమాను రూపొందించారు బాలీవుడ్ వాళ్లు.
లక్ష్య అనే యంగ్ హీరో చాలా సటిల్‌గా, పవర్ ఫుల్‌గా హీరో పాత్రను పోషించాడు. అలాంటి పాత్రను లారెన్స్ ఏం చేస్తాడో అని ఇప్పటికే నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు. లారెన్స్ ఇలాంటి సినిమాలో హీరోగా చేయడమే విడ్డూరం అంటే.. అతడికి జోడీగా త్రిషను కథానాయికగా తీసుకుంటున్నారనే వార్త ఇప్పుడు ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది.
సినిమాలో పెళ్లికి సిద్ధమైన ఒక యువ జంటగా హీరో హీరోయిన్లు కనిపిస్తారు. ఆ పాత్రల్లో నటీనటులిద్దరూ బాగా సూటయ్యారు. ఇలాంటి పాత్రల్లో లారెన్స్, త్రిష లాంటి ముదురు హీరో హీరోయిన్లను పెట్టడం కరెక్టేనా అన్నది ప్రశ్న. అసలు లారెన్స్ పక్కన త్రిష సూటవుతుందా అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. మొత్తంగా ‘కిల్’ సినిమాను కిల్ చేయడానికి రమేష్ వర్మ అండ్ కో చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ రోజుల్లో రీమేక్ చేయడమే కరెక్ట్ కాదన్న అభిప్రాయాలుండగా… ఇలాంటి మిస్ కాస్టింగ్‌తో రీమేక్ చేస్తే ఆ సినిమా ఎలా తయారవుతుందో?