టీపీసీసీ అధ్యక్షుడిగా మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి నియామకం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. తెలంగాణలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను, మంత్రి కేటీఆర్ ను దీటుగా ఎదుర్కోగల సత్తా రేవంత్ కు ఉందని భావించిన అధిష్టానం ఆ పదవిని రేవంత్ కు కట్టబెట్టిందని పలువురు కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఆ అభిప్రాయాలకు తగ్గట్టుగానే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ జోష్ లో ఉన్నారు.
ఈ క్రమంలోనే తాజాగా మంత్రి కేటీర్ పై రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ను మురుగునీటిలో కూర్చోబెట్టి నెత్తిమీద చెత్త వేయాలంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. అంతేకాదు, కేటీఆర్ ను మూసీ నదిలో నడుము లోతులో నీళ్లలో 4 గంటలు ఉంచాలని, అపుడే పేద ప్రజల సమస్యలు అర్థమవుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో డ్రైనేజీ, చెత్త సమస్యలపై మీడియాతో మాట్లాడిన రేవంత్ …కేటీఆర్ పై మండిపడ్డారు.
మెట్రో నగరంగా ఉన్న హైదరాబాద్ కేసీఆర్ పాలనలో చెత్త నగరంగా మారిందని విమర్శించారు. దేశంలోని 16 నివాసయోగ్యమైన పట్టణాలలో హైదరాబాద్కు చోటు దక్కలేదంటే కేటీఆర్ పనితీరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఓ రాష్ట్రంలో ఓ కాంట్రాక్టరు మోరీలలో చెత్త తీయకపోతే స్థానిక ఎమ్మెల్యే అతడిని మురుగునీటిలో కూర్చోబెట్టి, అతనిపై చెత్త వేయించి సన్మానించారని చెప్పారు.
ఆ విధంగా మంత్రి కేటీఆర్కు సన్మానం చేయాలని ఉందని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి భద్రత రీత్యా అలా చేయలేకపోతున్నామని, కానీ, ఏదో ఒక రోజు ఆ పరిస్థితి వస్తుందని జోస్యం చెప్పారు. హైదరాబాద్ నగరంలో డ్రైనేజి, చెత్త సహా ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో పోరాటం చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మరి, రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.