తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ బుధవారం మీడియా ముఖంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఇటు రాజకీయవర్గాలతో పాటు అటు తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశంగా మారాయి. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో కొండా సురేఖ టాలీవుడ్ పై నోరు జారారు. సినిమా ఇండస్ట్రీని రాజకీయాల్లోకి లాక్కురావడమే కాకుండా.. వ్యక్తిగత విషయమైన సమంత, నాగచైతన్య విడాకులు గురించి అక్కినేని కుటుంబం గురించి సంచలన ఆరోపణలు చేశారు. చైతు, సామ్ విడిపోవడానికి కేటీఆరే కారణమన్నారు.
కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు వివాస్పదం అయ్యాయి. ఇప్పటికే అక్కినేని కుటుంబం మరియు సమంత సురేఖ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. మీ హెడ్‌లైన్స్ కోసం మమ్మల్ని వాడుకోవద్దంటూ హితవు పలికారు. మరోవైపు సినీ పరిశ్రమకు చెందిన మరికొందరు స్టార్స్ కూడా కొండా సురేఖ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై రియాక్ట్ అవుతూ.. `గౌరవనీయులైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి నేను చాలా బాధపడ్డాను. వార్తల్లో నిలవడం కోసం సెలబ్రిటీలు, సినీ పరిశ్రమ సభ్యులను టార్గెట్‌గా చేసి మాట్లాడటం సిగ్గు చేటు.. ఇలాంటి దుర్మార్గపు మాటలతో దాడులు చేయడాన్ని మా చిత్ర పరిశ్రమ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. సంబంధం లేని వ్యక్తులను, అంతకుమించి మహిళలను రాజీకాయల్లోకి లాగడం మరియు అసహ్యకరమైన కల్పిత ఆరోపణలు చేయడం దిగజారుడుతనం అవుతుంది. సమాజాన్ని సరైన మార్గంలో నడిపించేందుకు నాయకులను ఎన్నుకుంటాం. కానీ మీ ప్రసంగాలతో సమాజాన్ని కలుషితం చేయకూడదు. రాజకీయ నాయకులు, గౌరవప్రదమైన స్థానంలో ఉన్నవారు సమాజానికి మంచి ఉదాహరణంగా ఉండాలి. సదరు మంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి` అంటూ ట్వీట్ చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తూ.. `కొండా సురేఖ గారూ, వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ. మీలాంటి బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని మరియు గోప్యతను గౌరవించాలి. ముఖ్యంగా సినిమా పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితంగా విసురుతున్న నిరాధారమైన ప్రకటనలు చూసి నిరుత్సాహంగా ఉంది. ఇతరులు మాపై నిరాధార ఆరోపణలు చేస్తుంటే మేం మౌనంగా కూర్చోము. ఒకరినొకరు గౌరవించుకోవడం, పరిధి దాటి ప్రవర్తించకుండా ఉండేందుకు ఈ అంశాన్ని కచ్చితంగా లేవనెత్తుతాం. ప్రజాస్వామ్య భారతదేశంలో మన సమాజం అటువంటి నిర్లక్ష్య ప్రవర్తనను సాధారణీకరించకుండా చూసుకుందాం.` అంటూ ఎక్స్ ద్వారా కొండా సురేఖపై మండిపడ్డారు.
`నాగార్జున కుటుంబాన్ని అత్యంత హార్రిబుల్ గా అవమానపరిచిన కొండా సురేఖ కామెంట్లకి నేను షాక్ అయిపోయాను . తన రాజకీయ ప్రత్యర్థి మీద పగ తీర్చుకోవడానికీ మధ్యలో ది మోస్ట్ రెస్పెక్టెడ్ నాగార్జున ఫ్యామిలీని రోడ్ మీదకి లాగడం ఏ మాత్రం భరించకూడదు` అని ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు.
న్యాచురల్ స్టార్ నాని రియాక్ట్ అవుతూ.. `ఛీ.. రాజకీయ నాయకులు ఎలాంటి అవాస్తవాలు మాట్లాడినా తప్పించుకోవచ్చని అనుకోవడం చూస్తే అసహ్యం వేస్తుంది. మీ మాటలు చాలా బాధ్యతారహితంగా ఉన్నప్పుడు, మీ ప్రజల పట్ల మీకు ఏదైనా బాధ్యత ఉంటుందని ఆశించడం మా తెలివితక్కువ పని. ఇది కేవలం నటులు లేదా సినిమా గురించి కాదు. ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినది కాదు. ఇంత గౌరవప్రదమైన హోదాలో ఉన్న వ్యక్తి మీడియా ముందు ఇలా నిరాధారమైన మాటలు మాట్లాడడం సరైంది కాదు. మన సమాజాన్ని చెడుగా ప్రతిబింబించే ఇలాంటి ఆచారాన్ని మనందరం ఖండించాలి` అంటూ ట్వీట్ చేశారు.
`మంత్రి కొండా సురేఖ గారూ, మీ నీచమైన, స్త్రీ ద్వేషపూరిత వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయి. సినీ ప్రముఖులను రాజకీయ పావులుగా వాడుకోవడం మీ బుద్ధిని తెలియజేస్తుంది. మీ చౌకైన వ్యూహాలకు మా సోదరభావం బెదిరిపోదు లేదా బెదిరింపులకు గురికాదు. మీరు కేవలం మహిళలను అవమానించడం కాదు, తెలంగాణకు గర్వకారణమైన మొత్తం పరిశ్రమను అగౌరవపరుస్తున్నారు. గాసిప్ నుండి పాలన వైపు దృష్టి మరల్చాల్సిన సమయం ఇది. మీ గౌరవం ఇప్పటికే తగ్గిపోయింది. దానిని మరింత దిగజార్చద్దు` అంటూ సుధీర్ బాబు ఘాటుగా ట్వీట్ చేశారు. ఇక వీళ్లే కాకుండా నటి ఖుష్బూ, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అల్లు అర్జున్, మంచు లక్ష్మి తదితర సినీ ప్రముఖులు కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబడుతున్నారు.