గత వైసీపీ ప్రభుత్వ హయాంలో సినిమా టికెట్ల వ్యవహారంతో పాటు మెగాస్టార్ చిరంజీవి వంటి సినీ ప్రముఖులను జగన్ ట్రీట్ చేసిన విధానం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి టాలీవుడ్ లోని మెజారిటీ వర్గం అండగా నిలిచింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను టాలీవుడ్ కు చెందిన పలువురు నిర్మాతలు, దర్శకులు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆ భేటీలో పాల్గొన్న తర్వాత మీడియాతో మాట్లాడిన నిర్మాత అల్లు అరవింద్ కీలక వ్యాఖ్యలు చేశఆరు. పవన్ తో సమావేశం ఉల్లాసంగా సాగిందని, చంద్రబాబు అపాయింట్మెంట్ దొరికితే ఇండస్ట్రీలోని పలు విభాగాలకు చెందిన వారంతా వచ్చి ఇద్దరినీ అభినందిస్తామని అన్నారు. సీఎం అపాయింట్మెంట్ తప్పకుండా ఇప్పిస్తానని పవన్ హామీ ఇచ్చారని చెప్పారు. ఇండస్ట్రీ సమస్యల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించలేదని, టికెట్ ధరల పెంపు చాలా చిన్న విషయమని అన్నారు.
చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలు కొన్ని మాట్లాడుకున్నామని, కానీ ఈసారి ప్రభుత్వాన్ని పరిశ్రమ ప్రతినిధుల బృందం కలిసినప్పుడు అన్ని విషయాలు మీడియాకు చెబుతామని అల్లు అరవింద్ చెప్పారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన టాలీవుడ్ ప్రముఖులలో అల్లు అరవింద్ తో పాటు దిల్ రాజు, ఏఎం రత్నం, అశ్వినీదత్, ఎలమంచిలి రవిశంకర్, నవీన్ ఎర్నేని, ఎస్ రాధాకృష్ణ, చిన్న బాబు, భోగవల్లి ప్రసాద్, నాగ వంశీ, టీజీ విశ్వప్రసాద్, వంశీకృష్ణ ఉన్నారు. ఈ సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా పాల్గొన్నారు. పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కు వారంతా అభినందనలు తెలిపారు.