ఆంధ్రప్రదేశ్లో సినిమా టికెట్ల ధరల సమస్య ఒక కొలిక్కి వస్తోందనుకుంటున్న తరుణంలో కొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి వ్యక్తిగతంగా, ఆ తర్వాత ఇతర సినీ ప్రముఖులతో కలిసి సమావేశం కావడం ద్వారా సమస్య పరిష్కారానికి ఎంతగానో కృషి చేయడం తెలిసిన సంగతే.
ఐతే పరిశ్రమ కోరుకుంటున్నట్లుగా టికెట్ల రేట్ల సవరణ జరిగి సమస్య సద్దుమణిగితే చిరంజీవికి క్రెడిట్ వెళ్లిపోతుందన్న ఉద్దేశమో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య చిరు అంటే అస్సలు గిట్టనట్లు వ్యవహరిస్తున్న మంచు కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు ఆయనకు పరోక్షంగా చురకలు అంటించే ప్రయత్నం చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇటీవల మంచు విష్ణు మాట్లాడుతూ.. చిరు వ్యక్తిగతంగా వెళ్లి ఏపీ సీఎంను కలిస్తే అది ఇండస్ట్రీ తరఫున జరిగిన సమావేశం కాదన్నట్లుగా వ్యాఖ్యానించడం తెలిసిందే.
ఇదిలా ఉంటే ఇటీవల ఏపీ సీఎంతో చిరు బృందం సమావేశమైన వెంటనే ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానిని తమ ఇంటిపి పిలిపించుకుని మోహన్ బాబు, విష్ణు ఆయన్ని సత్కరించడం, సదరు ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విష్ణు పెట్టిన పోస్టు వివాదాస్పదం కావడం తెలిసిందే.
ఆ గొడవ తర్వాత ఇప్పుడు విష్ణు నేరుగా వెళ్లి జగన్ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎంను పొగడ్తల్లో ముంచెత్తడం సంగతి పక్కన పెడితే.. విష్ణు ఒక ఆరోపణ చేయడంతో మీడియా దృష్టిని ఆకర్షించారు. ఇటీవలి సినీ ప్రముఖులతో సీఎం సమావేశానికి మోహన్ బాబుకు కూడా ప్రభుత్వం నుంచి ఆహ్వానం పంపారని.. కానీ అది తన తండ్రికి చేరలేదని.. అది చేరకుండా చేసిందెవరో తమకు తెలుసని విష్ణు వ్యాఖ్యానించడం గమనార్హం.
అది తమ అంతర్గత విషయం కాబట్టి అలా చేసిందెవరో తాను చెప్పనని.. ఆ విషయంలో ఏం చేయాలో అది చేస్తామని విష్ణు పేర్కొన్నాడు. చూస్తుంటే ఇప్పుడు ఇదో వివాదంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.