ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. పుష్ప-2 సినిమా విడుదల నేపథ్యంలో డిసెంబరు 4న సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించడం సంచలనం రేపింది. ఆ ఘటన నేపథ్యంలోనే అల్లు అర్జున్ పై కూడా కేసు నమోదైంది.
సంధ్య థియేటర్ యజమాని, మేనేజర్, సెక్యూరిటీ మేనేజర్ ను పోలీసులు ఆల్రెడీ పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా అల్లు అర్జున్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే, అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేయలేదని, విచారణ కోసం స్టేషన్ కు తీసుకువెళ్లారని అల్లు అర్జున్ పీఆర్ టీం చెబుతోంది. ఈ రోజు సాయంత్రం లోపు అల్లు అర్జున్ స్టేషన్ బెయిల్ పై బయటకు రావచ్చని తెలుస్తోంది.
పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ప్రైవేటు బౌన్సర్లతో అల్లు అర్జున్ థియేటర్ కు వచ్చారని, ఆ క్రమంలోనే తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మరణించిందని జాతీయ మానవ హక్కుల సంఘానికి పలువురు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ పై కేసు నమోదైంది.