టాలీవుడ్లో మళ్లీ ఓ పెద్ద సినిమా హంగామాకు రంగం సిద్ధమైంది. మాస్ రాజా రవితేజ కొత్త చిత్రం ఈగల్ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సంక్రాంతి తర్వాత టాలీవుడ్లో కొత్త సినిమాల సందడి పెద్దగా లేదు. రెండు వారాలు అసలు కొత్త రిలీజ్లే లేవు. గత వారం వచ్చిన అంబాజీపేట మ్యారేజి బ్యాండు సహా మిగతా సినిమాలన్నీ చిన్న స్థాయివే.
సంక్రాంతి చిత్రాల్లో మిగతా వాటి రన్ రెండు వారాలు దాటలేదు. హనుమాన్ ఒక్కటే మూడో వారంలోనూ బాగా ఆడింది. నాలుగో వారంలోకి అడుగు పెట్టే సమయానికి ఆ సినిమా జోరు తగ్గింది. చూడాల్సిన ప్రేక్షకులంతా ఆ సినిమా చూసేశారు. మళ్లీ ఓ పెద్ద సినిమా కోసం రెగ్యులర్ సినీ గోయర్స్ ఎదురు చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఈగల్ మూవీ వస్తోంది.
ఈ వీకెండ్లో ఇంకో మూడు సినిమాలు షెడ్యూల్ అయ్యాయి. అందులో యాత్ర-2 గురువారమే రిలీజైంది. అది పొలిటికల్ ప్రాపగండా మూవీ కావడంతో దాని మీద సగటు ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు. సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రత్యేక పాత్ర చేసిన లాల్ సలామ్ గురించి పట్టించుకోవట్లేదు. ట్రూ లవర్కు కూడా అంతగా హైప్ లేదు. దీంతో మొత్తం ఫోకస్ అంతా ఈగల్ మీదే ఉంది.
రవితేజ కెరీర్లోనే అత్యంత భారీగా తెరకెక్కిన చిత్రమిది. కొత్తగా ఉంటూనే ఆయన మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్, ఎలివేషన్లకు లోటు లేని సినిమాలా కనిపిస్తోంది ఈగల్. సినిమా పట్ల సగటు సినీ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచేలా ఉన్నాయి ప్రోమోలు. మొత్తంగా మంచి బజ్, టైమింగ్తో రిలీజవుతున్న ఈగల్.. అంచనాలకు తగ్గట్లు ఉంటే మాస్ రాజా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశాలున్నాయి.