ఉమ్మడి ఆంధ్రప్రదేవ్‌లో అయినా, రెండు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక అయినా.. గతంలో అధికారంలో ఎవరు ఉన్నప్పటికీ టాలీవుడ్ ను, సినిమా వాళ్లను పనిగట్టుకుని టార్గెట్ చేసేవాళ్లు కాదు. తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా సినిమా వాళ్లను ఇబ్బంది పెట్టింది కానీ.. అధికారంలోకి వచ్చాక మాత్రం వాళ్లను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించలేదు. సినిమా వాళ్లు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల భయభక్తులతో ఉండేవాళ్లన్నది వాస్తవం. దీంతో ఎక్కడా ఘర్షణకు ఆస్కారమే లేకపోయింది.
2014-19 మధ్య టీడీపీతో సినిమా వాళ్లకు అసలేమాత్రం సమస్య లేదు. సినిమా వాళ్లతో టీడీపీకి ముందు నుంచి సత్సంబంధాలే ఉన్నాయి. కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా సినీ జనాలను ఒక ప్రభుత్వం పనిగట్టుకుని టార్గెట్ చేయడం 2019లో ఏపీలో వైకాపా అధికారంలోకి వచ్చాకే జరిగింది. సినిమా వాళ్లలో ఎక్కువమంది టీడీపీ, జనసేన మద్దతుదారులన్న అసహనం కారణం కావచ్చు. దాంతో పాటు తమ ప్రధాన రాజకీయ ప్రత్యర్థుల్లో ఒకరైన పవన్ కళ్యాణ్ మీద ఉన్న కోపం కావచ్చు.. మరేదైనా కారణం కావచ్చు.. గత కొన్నేళ్లలో సినీ రంగాన్ని వైసీపీ ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలిసిందే.
ముందు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసేందుకు పాత జీవోను బయటికి తీసి 5 రూపాయల రేటుతో టికెట్లు అమ్మించడంతో మొదలుపెట్టి.. ఆ తర్వాత మొత్తంగా సినీ పరిశ్రమకు ఉచ్చు బిగించింది జగన్ సర్కారు. పవన్ అనే కాక ఎవరైనా నోరెత్తితే వాళ్ల సినిమాలను టార్గెట్ చేయడం మొదలుపెట్టింది. దీంతో ఒక దశలో ఇండస్ట్రీ జనాలు ఉక్కిరిబిక్కిరి అయిపోయి ప్రభుత్వం పట్ల నోరెత్తలేని పరిస్థితి కల్పించారు. చిరంజీవి సహా పలువురు అగ్ర హీరోలను తన దగ్గరికి రప్పించుకుని సలాం కొట్టించుకున్నాక కానీ జగన్ అహం చల్లారలేదు.
టికెట్ల రేట్లు పెంచలేదు. ఐతే జగన్‌తో, జగన్ పార్టీతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో అనుభవం అయినప్పటికీ.. ఎన్నికలు వచ్చేసరికి సినీ జనాలు చాలామంది టీడీపీ, జనసేనలకు మద్దతుగా వాయిస్ వినిపించడం విశేషమే. నాని లాంటి తటస్థుడు కూడా పవన్‌కు జై కొట్టాడు. తాజాగా అశ్వినీదత్ టీడీపీకి మద్దతుగా పోస్ట్ పెట్టారు. ఇలా మరెంతో మంది కూటమి వైపు నిలబడ్డారు. హైపర్ ఆది సహా పలువురు కమెడియన్లు కూడా జనసేనకు మద్దతుగా, వైసీపీకి వ్యతిరేకంగా గట్టిగా గళం వినిపించారు.
అటు ఇటు అయి జగన్ సర్కారు మళ్లీ అధికారంలోకి వస్తే.. వీళ్లను టార్గెట్ చేస్తారని తెలిసినా ఏం జరిగినా చూసుకుందాం అన్నట్లు కూటమికో, పవన్కో జై కొట్టారు సినీ జనాలు. బహుశా జగన్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్న ధీమా వల్ల కూడా ఇలా స్టాండ్ తీసుకుని ఉండొచ్చు. మరి వారు కోరుకున్నట్లే ఏపీలో అధికార మార్పిడి జరుగుతుందేమో చూడాలి.