ఈ దీపావళి పండక్కి తెలుగులో విడుదలైన చిత్రాల్లో `లక్కీ భాస్కర్` ఒకటి. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించారు. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. నాగ వంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన లక్కీ భాస్కర్.. అక్టోబర్ 31న విడుదలై హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
డబ్బు వల్ల గౌరవం పెరుగుతుంది.. కానీ ఆ డబ్బును సంపాదించే మార్గం సరైనది కానప్పుడు.. అది ఆ గౌరవాన్ని ఏదో ఒక రోజున కూల్చేస్తుంది. డబ్బు సుఖాన్ని ఇస్తుంది కానీ.. ప్రశాంతతను మాత్రం ఇవ్వలేదు అనే పాయింట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా విమర్శకుల నుండి సైతం ప్రశంసలు అందుకుంది. టాక్ అనుకూలంగా ఉండటంతో.. బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో దుమ్ము దుమారం లేపుతోంది.
సీతారామం తర్వాత తెలుగులో దుల్కర్ కు లక్కీ భాస్కర్ రూపంలో మరో హిట్ వచ్చి పడింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. సినీ పరిశ్రమలో కథలు చేతులు మారడం చాలా కామన్. అయితే లక్కీ భాస్కర్ విషయంలోనూ అది జరిగిందట. డైరెక్టర్ వెంకీ అట్లూరి మొదట ఈ చిత్రాన్ని న్యాచురల్ స్టార్ నానితో చేయాలని భావించాడట.
నానికి స్టోరీని కూడా నెరేట్ చేయడం జరిగిందట. కానీ పలు కారణాల వల్ల లక్కీ భాస్కర్ ను నాని రిజెక్ట్ చేశాడు. దాంతో వెంకీ అట్లూరి మరో ఆప్షన్ లేకుండా దుల్కర్ సల్మాన్ కు కథ చెప్పి ఒప్పించాడు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయింది. టాలీవుడ్ లో దుల్కర్ మార్కెట్ మరింత పెరిగింది. లక్కీ భాస్కర్ ను మిస్ చేసుకున్న అన్ లక్కీ హీరోగా నాని మిగిలిపోయాడు.