టాలీవుడ్లో ఒకే కథతో రెండు సినిమాలు తెరకెక్కడం కొత్తేమీ కాదు. ఒక కథతో సినిమా తీశాక.. దాన్ని రీమేక్ చేయడం, ఇంకో వెర్షన్ తీయడం లాంటివి చాలానే చూశాం. అలా కాకుండా ఒకే సమయంలో ఒక కథతో రెండు సినిమాలు ప్రకటించడం మాత్రం అరుదే.
గతంలో అల్లూరి సీతారామరాజు కథతో సీనియర్ ఎన్టీఆర్ సినిమా చేయాలనుకుంటే.. ఆలోపే కృష్ణ అదే కథతో సినిమా తీసి మరపురాని విజయాన్నందుకున్నాడు. దీని వల్ల ఎన్టీఆర్, కృష్ణ మధ్య విభేదాలు తలెత్తినట్లు కూడా చెబుతారు. ఆ సంగతలా వదిలేస్తే ఇప్పుడు టాలీవుడ్లో ఒకే కథతో స్వల్ప వ్యవధిలో రెండు సినిమాలు ప్రకటించడం.. ఈ విషయంలో సై అంటే సై అంటూ గొడవకు దిగుతుండటం చర్చనీయాంశం అవుతోంది.
ఒకప్పుడు ఆంధ్రా ప్రాంతంలో దోపిడీలతో హడలెత్తించిన గజ దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఇంతకుముందే బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా ‘స్టువర్టుపురం దొంగ’ పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కేఎస్ అనే దర్శకుడితో శ్రీనివాస్ తండ్రి బెల్లంకొండ సురేష్ నిర్మాతగా ఈ సినిమాను ప్రకటించారు.
వీటిలో ఏదో ఒకటి డ్రాప్ కాక తప్పదేమో అన్న సందేహాలు కలిగాయి. ఐతే ఎవ్వరూ తగ్గట్లేదు. ఎవరికి వారు తాము ఈ కథతో సినిమా చేస్తామని ముందుకెళ్లిపోతున్నారు. ఐతే వీటిలో ఏది ముందు రిలీజైతే.. దానికి అడ్వాంటేజ్ ఉంటుంది. రెండో సినిమా అన్యాయం అయిపోవడం గ్యారెంటీ. హిందీలో హర్షద్ మెహతా కథతో ‘స్కామ్ 1992’ అనే వెబ్ సిరీస్ రావడం, అది సూపర్ హిట్ కావడం జరిగింది. ఆ తర్వాత అభిషేక్ బచ్చన్ ఇదే కథతో ‘బిగ్ బుల్’ సినిమా చేశాడు. అది తుస్సుమనిపించింది.
ఇక టైగర్ నాగేశ్వరరావు బయోపిక్ విషయానికి వస్తే రవితేజతో ప్రకటించిన సినిమా క్రేజ్ ఎక్కువగా ఉంది. ఆ సినిమా స్కేల్ కూడా పెద్దదే. పైగా రవితేజ యమ ఫాస్టుగా సినిమాను లాగించేసే అవకాశాలున్నాయి. ఇదే జరిగి ముందు మాస్ రాజా మూవీ రిలీజైతే బెల్లంకొండ బాబు సినిమా ఆపుకోవడం బెటర్. ఐతే ఈ గొడవ ఇప్పుడు తెలుగు ఫిలిం చాంబర్ పెద్దల దగ్గరికి వచ్చిందని, ఇరువురితో మాట్లాడి దేన్నో ఒకదాన్ని డ్రాప్ చేయించాలని చూస్తున్నారని సమాచారం. బహుశా బెల్లంకొండ వారి సినిమాకే బ్రేక్ పడొచ్చు.