కేంద్ర హోం మంత్రి అమిత్ షా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ఎంతలా టార్గెట్ చేసినా తమ వశం కాని పశ్చిమ బెంగాల్ కోటపై కాషాయ జెండా ఎగరేసేందుకు వీలుగా ఆయన పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ చేతికి అధికారం వచ్చేలా చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా కోల్ కతాలో బీజేపీ నేతలు.. కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముస్లిం ఓటు బ్యాంక్ కోసం మమత బెనర్జీ పార్టీ బుజ్జగింపు రాజకీయాల్ని చేస్తున్నారని మండిపడ్డారు.
పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ శకం 2026తో ముగుస్తుందన్న జోస్యం చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. కేవలం ముస్లిం ఓట్ల కోసమే ఆపరేషన్ సిందూర్.. వక్ఫ్ సవరణ బిల్లుల్ని గుడ్డిగా వ్యతిరేకిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఆపరేషన్ సిందూర్ ను వ్యతిరేకిస్తున్న ముఖ్యమంత్రి మమతకు మహిళలు తగిన గుణపాఠం నేర్పటం ఖాయమన్నారు.
ఉగ్రవాదుల్ని మోడీ సర్కారు అణిచివేయటాన్ని మమతా బెనర్జీ భరించలేకపోతున్నట్లుగా పేర్కొన్న అమిత్ షా.. ‘‘ఓటు బ్యాంక్ ను కాపాడుకోవటానికి మమతా బెనర్జీ ఎంతకైనా దిగజారుతారు. పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిలో పశ్చిమ బెంగాల్ కు చెందిన వారు కూడా మరణించారు.అయినా మమత నోరెత్తలేదు. వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా బెంగాల్ లోని ముర్షీదాబాద్ లో జరిగిన హింసాకాండ వెనుక మమత బెనర్జీ ప్రభుత్వ హస్తం ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహంతోనే బంగ్లాదేశ్ నుంచి బెంగాల్ కు అక్రమ వలసలు కొనసాగుతున్నాయి. వలసదార్ల కోసం సరిహద్దులు తెరిచేశారు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది జరిగే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు బెంగాల్ భవిష్యత్తును మాత్రమే కాదు.. దేశ భద్రతతో ముడిపడి ఉన్నాయన్న వ్యాఖ్య చేసిన అమిత్ షా.. బంగ్లాదేశ్ నుంచి వచ్చే వలసల్ని ఆపే సత్తా బీజేపీకి మాత్రమే ఉందన్నారు. ఎన్నికల్లో హింసను ఆశించకుండా డిపాజిట్లు తెచ్చుకోగలరా? అంటూ సవాలు విసిరిన అమిత్ షాకు బెంగాల్ అధికారపక్షం స్పందించింది. సరిహద్దుల రక్షణ కేంద్ర హోం శాఖ పరిధిలో ఉంటుందన్న విషయాన్ని అమిత్ షా మర్చిపోకూడదన్నారు. బంగ్లాదేశ్ నుంచి వలసదారులు రాకుండా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న వారి ప్రశ్న అమిత్ ఘాటు వ్యాఖ్యల్లోని తీవ్రతను తగ్గించిందని చెప్పక తప్పదు.