తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి.. టీడీపీ అధినేత చంద్రబాబు అందరికన్నా ముందుగానే నిర్ణయం తీసుకుని.. ఇక్కడ ‘పనబాక లక్ష్మి’కి అవకాశం ఇచ్చారు. ఈ విషయంలో ఆయన తొందరపడ్డారనే భావన ఇటు పార్టీలోను, అటు పార్టీ సానుభూతిపరుల్లోనూ వినిపిస్తోంది. దీనికి రెండు ప్రధాన కారణాలు కనిపిస్తున్నా యి. ఒకటి.. తిరుపతి పార్లమెంటు స్థానంలో టీడీపీ గెలిచిన సందర్భాలు ఇటీవల కాలంలో ఎక్కడా లేవు. సాధారణంగా ఆయన ఎన్నికల సమయంలో ఎవరితో పోత్తు ఉంటే. వారికి వదిలేస్తున్నారు.
ఒకవేళ పొత్తు లేని సందర్భంలో టీడీపీ పోటీ చేసినప్పటికీ.. సదరు అభ్యర్థి గెలిచిన సందర్భం కూడా లేదు. అంటే.. దాదాపుగా టీడీపీ ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది.. 1984లో ఒక్కసారి మాత్రమే. అప్పటి ఎన్నికల్లో ‘చింతా మోహన్’ టీడీపీ తరపున ఇక్కడ నుంచి గెలుపు గుర్రం ఎక్కారు. ఆ తర్వాత ఇప్పటి వరకు టీడీపీ ఇక్కడ పాగా వేసింది లేదు. గత ఏడాది ఎన్నికల్లో ఒంటరిగా బరిలోకి దిగిన సమయంలో కాంగ్రెస్ మాజీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి ‘పనబాక లక్ష్మి’కి అవకాశం ఇచ్చినా.. ఆమె కూడా 2లక్షల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు.
ఈ పరిణామాలను గమనిస్తే.. ఇప్పుడు కూడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కుతుందనే అంచనాలు తక్కువగానే ఉన్నాయి. పైగా తిరుపతి నియోజవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ బలంగా ఉంది. సర్వేపల్లి, గూడూరు, వెంకటగిరి, సూళ్లూరుపేట, తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాల్లో ఎక్కడా టీడీపీ గెలుపు గుర్రం ఎక్కలేదు. పైగా.. ఇక్కడ వైసీపీకి బలమైన నాయకులు ఉన్నారు. దీంతో వారి హవా ఎక్కువగా ఉంది. ఇక, మంత్రి పెద్దిరెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డివంటి బలమైన నేతలు ఇక్కడ చక్రం తిప్పుతున్నారు.
ఈ నేపథ్యంలో చంద్రబాబు ఇక్కడ నేరుగా దిగడం వల్ల ప్రయోజనం ఉండదనే భావన వ్యక్తమవుతోంది. ఇలా కాకుండా.. ప్రస్తుతం ఏపీలో సెంటిమెంటుగా మారిన రాజధానిని పరిగణనలోకి తీసుకుని.. రాజధాని రైతుకు ఇక్కడ చంద్రబాబు ఛాన్స్ ఇస్తే.. తాను రాజధానికి కట్టుబడ్డాననే ఉద్దేశ్యాన్ని, రైతుకు ఇక్కడ అవకాశం ఇవ్వడం ద్వారా రాజధాని సెంటిమెంటును ప్రజలలోకి బలంగా తీసుకువెళ్లేందుకు కూడా అవకాశం ఉంటుందని అంటున్నారు పరిశీలకులు. ఇదిలావుంటే… ఇక్కడ గెలిచి, హఠాన్మరణం చెందిన బల్లి దుర్గాప్రసాద్.. పూర్వాశ్రమంలో టీడీపీకి చెందిన నాయకుడు.
గూడూరు నియోజకవర్గం నుంచి పలుమార్లు టీడీపీ తరఫున ఆయన అసెంబ్లీ కి ఎన్నికయ్యారు. అయితే.. గత ఏడాది తిరుపతి టికెట్ విషయంలో చంద్రబాబు ఆయనకు అప్పాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా వేధించారనే టాక్ ఉంది. ఈ క్రమంలోనే ఆయన వైసీపీలోకి జంప్ చేసి టికెట్ తెచ్చుకున్నారనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది కూడా టీడీపీకి ఎదురు గాలి గా మారే అవకాశం ఉంది. ఇలా.. ఏ విధంగా చూసుకున్నా.. చంద్రబాబు తన ఆలోచనను సమీక్షించుకుని.. రైతుకు అవకాశం ఇవ్వడమే.. మంచిదని అంటున్నారు టీడీపీ నాయకులు, సానుభూతిపరులు కూడా.