‘ఏపీ ఎన్ ఆర్టీ’లకు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి లడ్డూ అంత తీపి కబురు చెప్పింది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని మరింతమంది దర్శించుకునేందుకు వీలుగా రోజువారీ బ్రేక్ దర్శనం కోటాను 100మందికి పెంచుతూ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో 50మందికి ఉన్న కోటాను ఇప్పుడు 100 మందికి పెంచింది. ఏపీ ఎన్ ఆర్టీలతోపాటు వారి ఎన్నారై కుటుంబ సభ్యులకు కూడా ఈ కోటా వర్తిస్తుంది.
ప్రత్యేకించి వృద్ధులైన తల్లిదండ్రులు, అత్తమామలు వంటి కుటుంబ సభ్యులకు పెంచిన కోటా ఎంతో ఉపయుక్తంగా ఉండనుంది. అయితే, నిర్ణీత రుసుము చెల్లించి ఈ కోటా ద్వారా బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. ఈ ప్రకారం టీటీడీ అడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. కొత్త కోటా ప్రకారం ఏపీఎన్ఆర్టీ ల నుంచి వచ్చే విజ్నప్తలను పరిగణలోకి తీసుకోవాలని టీటీడీ అధికారులకు సూచించింది. ఈ కోటా పెంచిన టీటీడీ అధికారులకు, ఏపీ ప్రభుత్వానికి ఏపీఎన్నార్టీలు ధన్యవాదాలు తెలిపారు.