బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె కవితకు కోపమొచ్చింది. మరీ.. ఇంత అన్యాయమా? అంటూ నిప్పులు చెరుగుతున్నారు. తీహార్ జైలు అధికారులపై ఆమె ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించారు. జ్యూడీషియల్ రిమాండ్ లో భాగంగా ఆమెను తీహార్ జైలుకు పంపిన నేపథ్యంలో ఆమెకు పలు వసతులు కల్పించేందుకు వీలుగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. కోర్టు చెప్పిందేదీ అమలు చేయట్లేదంటూ కవిత మండిపడుతున్నారు.
తీహార్ జైలు అధికారులు తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు ఆమె తరఫు న్యాయవాదులు. ఈ నేపథ్యంలో శనివారం రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరగనుంది. తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని.. వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు. తన వినతిని పరిగణలో ఉంచుకొని కోర్టు తనకు వసతులు కల్పించాలని ఆదేశాల్ని ఇవ్వగా.. తీహార్ జైలు అధికారులు వాటిని అమలు చేయట్లేదని ఆరోపించారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో భాగంగా అరెస్టు అయిన కవిత ఈడీ కస్టడీలో విచారణ ఎదుర్కొని.. తాజాగా తీహార్ జైలుకు వెళ్లటం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమెకు పలు వసతులు కల్పించే విషయంలో కోర్టు సానుకూలంగా స్పందింది.
అయితే.. న్యాయస్థానం ఆదేశాల్ని తీహార్ జైలు అధికారులు పట్టించుకోవటం లేదన్నది కవిత ప్రధాన ఆరోపణ. దీనిపై ఆమె తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. జైల్లో తనకు ఎదురైన అనుభవాల్ని ఆమె పిటిషన్ రూపంలో దాఖలు చేశారు. ఇందులో.. తనకు ఇంటి భోజనాన్ని అనుమతించటం లేదని.. పరుపులు ఏర్పాటు చేయలేదన్న ఆమె.. ‘‘కనీసం చెప్పులు కూడా అనుమతించటం లేదు. బట్టలు.. బెడ్ షీట్స్.. బ్లాంకెట్స్ లకు కూడా అనుమతి ఇవ్వట్లేదు. పెన్ను.. పేపర్లను అందుబాటులోకి ఉంచట్లేదు. కళ్లజోడు కూడా ఇవ్వట్లేదు.చేతిలో ఉన్న జపమాలను వెంటఉంచుకోవటానికి ఒప్పుకోవట్లేదు’’ అంటూ ఆమె అసహనం వ్యక్తం చేశారు.
జైలు అధికారుల తీరుపై తగిన చర్యలు తీసుకోవాలని ఆమె న్యాయస్థానాన్ని కోరారు. కోర్టు నుంచి తనకు కల్పించాల్సిన వసతుల గురించి తీహార్ జైలు సూపరింటిండెంట్ కు తగిన ఆదేశాలు ఇవ్వాలన్న ఆమె పిటీషన్ ను కోర్టు ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై శనివారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. కవిత పిటిషన్ పై న్యాయస్థానం ఏ రీతిలో రియాక్టు అవుతుందన్నది తేలేందుకు మరో 24 గంటలు వేచి చూడాల్సిందే.