కొవిడ్ తర్వాత థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య తగ్గిన మాట వాస్తవం. థియేటర్లకు ఆడియన్సును రప్పించడం పెద్ద సవాలుగా మారింది. బాగా క్రేజున్న, పెద్ద సినిమాలను మాత్రమే వాళ్లు వెండి తెరపై చూడ్డానికి ఇష్టపడుతున్నారు. చిన్న, మిడ్ రేంజ్ చిత్రాలకు జనాలు లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ప్రేక్షకులు థియేటర్లకు రావట్లేదని ఇండస్ట్రీ జనాలు చాలా బాధ పడుతుంటారు.
అదే సమయంలో క్రేజున్న పెద్ద సినిమాలు వచ్చాయంటే చాలు.. వాటికి టికెట్ల ధరలు పెంచేసి ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేస్తారు. ‘పుష్ప-2’ గొడవ తర్వాత తెలంగాణలో ధరల పెంపుకి అవకాశం లేకపోయింది. కానీ ఏపీలో మాత్రం అడిగినంత రేట్లు ఇచ్చేస్తున్నారు. ఐతే పెద్ద సినిమాలకు బడ్జెట్ ఎక్కువ, వాటి క్వాలిటీ, విజువల్స్ వేరు కాబట్టి కొంచెం రేటు పెంచినా ఓకే అనుకోవచ్చు.
కానీ మిడ్ రేంజ్ సినిమాలకు సైతం రేట్ల పెంపు ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న తలెత్తుతోంది. దీని వల్ల ఆక్యుపెన్సీలు తగ్గి సినిమాల మీద ప్రతికూల ప్రభావమే పడుతున్న మాట వాస్తవం. నాగచైతన్య సినిమా ‘తండేల్’కు ఏపీలో కొంత మేర రేట్లు పెంచారు. దాని వల్ల తొలి వారంలో ఆక్యుపెన్సీలు అనుకున్నంత మేర లేకపోయాయి. వసూళ్లు బొటాబొటిగా వచ్చాయి. ఈ ఉదాహరణ కనిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ‘రాబిన్ హుడ్’ మూవీకి ఏపీలో రేట్లు పెంచుకుంటున్నారు. సింగిల్ స్క్రీన్లలో రూ.50, మల్టీప్లెక్సుల్లో రూ.75 రేటు పెంచుతూ జీవో వచ్చేసింది.
ఐతే నితిన్ ఎప్పుడో ‘భీష్మ’తో హిట్టు కొట్టాడు. అతనేమీ పెద్ద స్టార్ కాదు. సినిమా కూడా మిడ్ రేంజిదే. ‘రాబిన్ హుడ్’కు బజ్ అయితే బాగానే ఉంది కానీ.. నార్మల్ రేట్లతో రిలీజ్ చేస్తే మంచి ఆక్యుపెన్సీలు ఉండే అవకాశముంది. కానీ రేట్లు పెంచడం అంటే ప్రేక్షకులను నిరుత్సాహానికి గురి చేయడమే. దీని వల్ల అంతిమంగా సినిమాకు చేటే జరుగుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ హయాంలో మరీ దారుణంగా రేట్లు తగ్గించడం ఎంత తప్పో.. ఇప్పుడు ఇలా క్రేజున్న ప్రతి సినిమాకూ అదనపు రేట్లు వడ్డించడం కూడా అంతే తప్పు అన్న వాదన వినిపిస్తోంది.