టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆస్కార్ బరిలో ఈ చిత్రం నుంచి నాటు నాటు పాట నిలవడంతో తెలుగువారంతా గర్వపడుతున్నారు. 450 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 1250 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాకుండా దర్శకుడిగా జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి రాజమౌళిని ఈ సినిమా తీసుకు వెళ్ళింది.
ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని చేయబోతున్నారు. దీంతో, మహేష్, జక్కన్నల కాంబినేషన్ లో రాబోయే ఆ సినిమాపై టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. రాజమౌళి తండ్రి విజయప్రసాద్ కథ అందిస్తున్న ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగుతుందని గతంలో విజయేంద్ర ప్రసాద్ ప్రకటించారు. రాజమౌళి చాలా కాలంగా ఆ జానర్ లో సినిమా చేయాలనుకుంటున్నాడని, అందుకే మహేష్ తో ఈ ప్రాజెక్టు చేస్తున్నామని వెల్లడించారు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన మరో కీలక అప్డేట్ టాలీవుడ్ సర్కిల్స్ లో జోరుగా షికారు చేస్తోంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో మహేష్ బాబుతో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లుగా పుకార్లు వినిపిస్తున్నాయి. అంతేకాదు, దాదాపు 30 భాషల్లో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పలు ఓటీటీ సంస్థలతో ఈ ప్రకారం జక్కన్న ఆల్రెడీ చర్చలు మొదలుబెట్టినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే, విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమా కోసం స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బిజీగా ఉండగా, మరోవైపు జక్కన్న పక్కాగా మార్కెటింగ్ చేసే పనులలో నిమగ్నమై ఉన్నాడని తెలుస్తోంది. ఏదేమైనా ప్రభాస్ కు బాహుబలి….చరణ్, తారక్ లకు ఆర్ఆర్ఆర్ మాదిరిగా మహేష్ బాబుకు కూడా భారీ హిట్ ఖాయమని మహేష్ బాబు ఫ్యాన్స్ ఇప్పటినుంచే సంబరపడిపోతున్నారు.