ఎవరూ గీతను దాటకూడదు. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే తర్వాతి రోజుల్లో తిప్పలు తప్పవు. రూల్ బుక్ ప్రకారం నడుచుకుంటే సరిపోయేదానికి.. అధికారంలో ఎవరుంటే వారికి అనుకూలంగా వ్యవహరించటం.. విధానాల్ని పక్కన పెట్టేయటం.. పవర్ లో ఉన్న వారి ప్రాపకం కోసం చేసే ప్రయత్నాలతో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయన్న దానికి నిదర్శనంగా ఇటీవలకాలంలో ఏపీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
మొన్నటికి మొన్న జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి వెళ్లి.. జగన్ సర్కారులో ఇష్టారాజ్యంగా మాట్లాడాను తప్పైందని.. తనను క్షమించాలని కోరుతూ ఒక లాయర్ బ్రతిమిలాడటం.. పార్టీలో చేర్చుకోవాలని కోరటం తెలిసిందే. దీనికి ససేమిరా అన్నా.. బ్రతిమిలాడుతున్న సదరు లాయర్ ను తన మనుషులతో ఎత్తించి.. ఇంటి బయట విడిచి పెట్టిన వైనం.. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారటం తెలిసిందే.
కట్ చేస్తే.. తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగన్ సర్కారులో నాటి విపక్ష నేత చంద్రబాబుపై తొడ కొట్టి.. మీసాలు తిప్పి సంగతి తేలుస్తామంటూ బహిరంగ సవాళ్లు విసరటమే కాదు.. ఎంత పోలీసు అధికారుల సంఘం అయితే మాత్రం ఇలా మాట్లాడటమా? అంటూ అప్పట్లో పలువురు ముక్కున వేలేసుకున్న పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు అధికారపక్షం ఒత్తిడికి తలొగ్గి.. పదవుల మీద ఆశతో ఇష్టారాజ్యంగా వ్యవహరించిన ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు తాజాగా తమ తప్పును తెలుసుకున్నారు.
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆ సంఘం సభ్యులు వచ్చి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యను కలిశారు. తాము చేసిన పనికి సారీ చెప్పారు. అప్పట్లో జరిగిన పరిణామాల్ని మనసులో పెట్టుకోవద్దని కోరారు. ‘అప్పట్లో పై అధికారుల ఒత్తిడి వల్లే అలా తిట్టాల్సి వచ్చిందే తప్పించి.. మా మనసుల్లో ఇంకే ఉద్దేశం లేదు. మరోలా అనుకోకుండా పెద్ద మనసుతో మమ్మల్ని క్షమించండి’’ అంటూ వర్ల రామయ్యను బతిమిలాడారు.
భేటీ ముగిసిన తర్వాత సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. పోలీసు వ్యవస్థ మనోభావాలు దెబ్బ తీసేలా ఎవరైనా మాట్లాడితే దానికి కౌంటర్ ఇవ్వటమే కానీ వ్యక్తిగతంగా ఎవరిపైనా తమకు కక్ష లేదన్నారు. అప్పట్లో చంద్రబాబుపై విమర్శలు చేసినప్పుడూ ఒక పోలీసు అధికారిగా అలా చేయకూడదని నాకు అనిపించింది. ప్రభుత్వ ఉద్యోగిగా ఎవరు అధికారంలో ఉంటే వారి విధానాలను అమలు చేయాల్సి వస్తుంది. మాకంటూ ప్రత్యేక అధికారాలేమీ ఉండవు.
ఒకప్పుడు ఆంధ్రా పోలీసులు పనికి రారని తెలంగాణ పోలీసుల్ని ఆశ్రయించిన జగన్.. అదే ఆంధ్రా పోలీసులతోనే గత ఐదేళ్లూ పాలించారు. ఇప్పుడు మళ్లీ పోలీసుల్ని తప్పుపట్టటం సరికాదు. జగన్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం’’ అంటూ వ్యాఖ్యానించారు. అందుకే అంటారు.. హద్దులు దాటటం ఎందుకు? దాటిన దానికి ఫీల్ కావటం ఎందుకు? రూల్ ప్రకారం డ్యూటీ చేసుకుంటూ పోతే పోయేదేముంది? అన్న చిన్నలాజిక్ ఎందుకు మిస్ అవుతారో?