టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాయలసీమలో కదం తొక్కుతున్న లోకేష్..జగన్ పాలనపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా.బద్వేలు ఆర్టీసి బస్టాండు దగ్గర నిర్వహించిన బహిరంగ సభకు ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. కనీవినీ ఎరుగని రీతిలో లోకేష్ పాదయాత్రకు విపరీతమైన స్పందన వచ్చింది.
బస్టాండ్ కూడలి నుండి సిద్ధవటం రోడ్, పోరుమామిళ్ల రోడ్, నెల్లూరు రోడ్ జనసంద్రాన్ని తలపించాయి. దాదాపు రెండు కిలోమీటర్ల వరకు ప్రజలు బారులు తీరారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యేపై లోకేష్ మండిపడ్డారు. బద్వేల్ లో వైసీపీని గెలిపిస్తే అభివృద్ధి నిల్లు… భూకబ్జాలు ఫుల్లు అని లోకేష్ దుయ్యబట్టారు. బద్వేల్ ఎమ్మెల్యే సుధ గారి స్థలాన్నే వైసీపీ నాయకులు కబ్జా చేశారంటే ఇక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోందన్నారు.
బద్వేల్ వైసీపీ నాయకులకి ముద్దుగా కాలకేయులు అని పేరు పెట్టానని, రూ.2 వేల కోట్ల విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ భూములు కబ్జా చేశారని లోకేష్ దుయ్యబట్టారు. వైసీపీ భూ బకాసురులు. ఎమ్మెల్సీ గోవింద రెడ్డి కలిసి బద్వేల్ ని మండలాల వారీగా కేకులా కోసి బంధువులకు పంచేశారని ఆరోపించారు.
పోరుమామిళ్లలో ఫుడ్ కమిటీ ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసి అమ్మేశాడని ఆరోపించారు. భూములను బినామీ పేర్లతో కాజేశారని దుయ్యబట్టారు. కలసపాడు వైసీపీ నేత గురివిరెడ్డి ఆసుపత్రి భూమినే లేపేశాడని, మరో 40 ఎకరాలు తన కుటుంబ సభ్యుల పేర్లతో కొట్టేశాడని ఆరోపించారు..
బద్వేల్ కి జగన్ అనేక హామీలు ఇచ్చాడని, బద్వేల్ టౌన్ ని మోడల్ టౌన్ గా మారుస్తానని హామీ ఇచ్చాడని లోకేష్ దుయ్యబట్టారు. బద్వేల్, గోపవరం, అట్లూరు మండలాలకు సోమశిల బ్యాక్ వాటర్ వద్ద లిఫ్ట్ ప్రాజెక్ట్ ఏర్పాటు చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చి నెరవేర్చలేదని చెప్పారు.