కరోనా దెబ్బకు అన్ని రంగాలతోపాటు సినీరంగం కూడా అతలాకుతలమైన సంగతి తెలిసిందే. కరోనా దెబ్బకు దాదాపు 8 నెలల పాటు థియేటర్లు మూసివేయడంతో వాటి యాజమాన్యాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. థియేటర్లలో ఫుల్ కెపాసిటీకి కేంద్రం ఇటీవల అనుమతులిచ్చినా, కరోనా నేపథ్యంలో జనాలు థియేటర్లకు పూర్తి స్థాయిలో రావడానికి కొంత సమయం పడుతుంది. దీంతోపాటు, అనేక కారణాలతో సినిమా థియేటర్లు ఇబ్బంది పడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే థియేటర్లను సంరక్షించేందుకు టాలీవుడ్ పెద్దలు ముందడుగు వేస్తున్నారు. ఇందులో భాగంగానే దాదాపు వందమంది థియేటర్ యజమానులతో ప్రముఖ నిర్మాతలైన సురేష్‌బాబు, దామోదర్ ప్రసాద్, బివియస్ఎన్ ప్రసాద్ తదితరులు భేటీ అయ్యారు. థియేటర్లు ఎదుర్కొంటున్న గడ్డు సమస్యల గురించి వాటి యజమానులు చర్చించారు. దీంతో, సినిమా ఫలితంతో సంబంధం లేకుండా వచ్చే రాబడిలో నిర్మాతలు, థియేటర్ యాజమాన్యాలు చెరి 50 శాతం పంచుకునేలా వెసులుబాటు కల్పించే యోచనలో నిర్మాతలున్నట్టు తెలుస్తోంది.
థియేటర్ల రెంట్లు, థియేటర్ షేర్ పెంపు వంటి అత్యంత కీలకమైన అంశాలను వారు చర్చించారు.ప్రస్తుతం పంపిణీదారులు నిర్ణయించిన 15 శాతం షేర్‌కి బదులుగా మల్టీప్లెక్స్ థియేటర్లకు ఇస్తున్న మాదిరిగా 50శాతం షేర్ సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కూడా ఇచ్చేట్టుగా నిర్మాతలు నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని థియేటర్ల యజమానులు కోరినట్టు తెలుస్తోంది. థియేటర్ యజమానులు వ్యక్తం చేసిన పాయింట్స్ పట్ల నిర్మాతల మండలి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. కొద్ది రోజులలోనే థియేటర్ల సమస్యలను అధ్యయనం చేసి, వాటికి శాశ్వత పరిష్కారాన్ని చేపట్టాలని నిర్మాతల మండలి సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తోంది. వచ్చే శనివారం నాడు ఈ విషయాలపై మరోసారి కీలకమైన సమావేశం జరగనున్నట్టు తెలుస్తోంది.